ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

13 Nov, 2018 18:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అసమ్మతి సెగ తగిలింది. రాష్ట్ర నాయకత్వం డబ్బులు తీసుకుని టిక్కెట్లు అమ్ముకుందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమ నాయకులకు న్యాయం జరగకపోతే రాజీనామాలకు, ఆత్మహత్యలకు వెనుకాడబోమని పార్టీ అధినాయకత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు.. శేరిలింగంపల్లి టికెట్‌ భవ్యా ఆనంద్‌ ప్రసాద్‌కు ఇవ్వడంతో నిరసనలు మిన్నంటాయి. ఆమె స్థానంలో మువ్వా సత్యనారాయణకు టికెట్‌ ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ ఓ కార్యకర్త పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
 
ఇదిలా ఉండగా.. యాదవులకు టిక్కెట్లు ఇవ్వలేదనే కారణంతో ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ ముందు ఓయూ యాదవ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అర్థనగ్న ప్రదర్శనలతో నిరసన తెలిపారు. యాదవ, గొల్ల కురుమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ డబ్బులు తీసుకుని టిక్కెట్లను అగ్రవర్ణాలకు అమ్ముకున్నారని ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు