నర్సాపూర్‌లో ఉద్రిక్తత

16 Aug, 2018 03:49 IST|Sakshi
ధర్నా వద్దే రక్తదానం చేస్తున్న సునీతాలక్ష్మారెడ్డి

     మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తల అరెస్ట్‌ 

     తన భర్త లక్ష్మారెడ్డి విగ్రహానికి నివాళులర్పించేందుకు అడ్డుకోవడంతో నిరసన

నర్సాపూర్, నర్సాపూర్‌ రూరల్‌: స్వాతంత్య్ర దినోత్సవం రోజున నర్సాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శివ్వంపేట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, దివంగత లక్ష్మారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని లయన్స్‌క్లబ్‌ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేయకుండా పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పోలీసుల తీరుకు నిరసనగా మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. ఆమెతో పాటు వందలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు రాస్తారోకో చేయడంతో సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. ఆగస్టు 15వ తేదీన లక్ష్మారెడ్డి వర్ధంతిని పుర స్కరించుకుని ఆయనకు నివాళులర్పించిన అనం తరం యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో లయన్స్‌క్లబ్‌లో రక్తదాన శిబిరాన్ని చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి లయన్స్‌ క్లబ్‌ ఆవరణం లో 13వ తేదీ నుంచి 144 సెక్షన్‌ విధించారు.

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు చేసుకోగా కార్యకర్తలు అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సునీతారెడ్డి బుధవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగుర వేసి విలేకరులతో మాట్లాడుతుండగానే తూప్రాన్‌ డీఎస్పీ రాంగోపాల్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దాంతో ఆమె అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.

లక్ష్మారెడ్డి విగ్రహం వద్దకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులకైనా అనుమతివ్వాలని కోరినా పోలీసులు ససేమిరా అనడంతో వారి తీరును ఖండిస్తూ ఆమె అంబేడ్కర్‌ విగ్రహం వద్దే రక్తదానం చేశారు. తన భర్త విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు అనుమతి ఇవ్వకపోవడం పట్ల సునీతారెడ్డి ధర్నా స్థలంలో కంటతడి పెట్టుకున్నారు. రాస్తారోకో చేస్తున్న పలువురు నాయకులను పోలీసులు శివ్వంపేట, వెల్దుర్తి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అనంతరం సునీతారెడ్డి, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చింది. మధ్యాహ్నం తర్వాత పోలీసులు అందరినీ విడుదల చేశారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులకు లక్ష్మారెడ్డి విగ్రహానికి నివాళులర్పించేందుకు అనుమతిలిచ్చారు. 

మరిన్ని వార్తలు