స్మార్ట్‌సిటీలో హాట్‌ రాజకీయం! 

13 Sep, 2019 08:48 IST|Sakshi
స్మార్ట్‌ సిటీ పనుల ప్రారంభోత్సవంలో మంత్రి గంగుల కమలాకర్, నాయకులు

ఓవైపు మొదలైన స్మార్ట్‌ రోడ్ల పనులు 

మరోవైపు టెండర్ల ప్రక్రియపై ఫిర్యాదులు 

సాక్షి, కరీంనగర్‌: స్టార్ట్‌సిటీగా కొత్త సొబగులు అద్దుకోవాల్సిన కరీంనగరం నేతల రాజకీయం ముందు తెల్లబోతోంది. కరీంనగర్‌లో స్మార్ట్‌ రోడ్ల కోసం నిధులు మంజూరైనా... టెండర్ల ప్రక్రియ దాటేందుకు సంవత్సర కాలం సరిపోయింది.  టెండర్ల ప్రక్రియ పూర్తికాకుండానే అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రి కేటీఆర్‌ స్మార్ట్‌ రోడ్ల పనులను ప్రారంభించినా పనులు మాత్రం గురువారం నుంచి మొదలయ్యాయి. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించినప్పటికీ టెండర్ల వివాదం నేపథ్యంలో గందరగోళం తొలగలేదు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత పాటించలేదని, సింగిల్‌ టెండర్‌కు రూ.164 కోట్ల విలువైన రెండు ప్యాకేజీల పనులు అప్పగించారని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై అధికార యంత్రాంగంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మొదలు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వరకు ఎంపీ సంజయ్‌ ఫిర్యాదులు చేశారు. టెండర్ల ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అదే సమయంలో నగర పాలక సంస్థలో ముఖ్య నేతగా వ్యవహరించిన అధికార పార్టీ నాయకుడు కూడా ఈ రోడ్ల టెండర్లపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ రోడ్ల పనులకు అడ్డంకులు ఎదురవుతాయేమోనని స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధికారులు ఆందోళన  చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే ఈ పనుల విషయంలో ఎంపీ సంజయ్‌ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని విచారణకు ఆదేశిస్తే... కాంట్రాక్టర్‌కు ఇచ్చిన వర్క్‌ ఆర్డర్‌ను నిలిపివేస్తారేమోనని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ రోడ్ల పనులు మళ్లీ రెండడుగులు వెనక్కు వెళ్లే ప్రమాదం లేకపోలేదు.  

ఆది నుంచి ముందుకుసాగని టెండర్ల ప్రక్రియ 
కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ప్రకటించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక పాత్ర పోషించారు. స్మార్ట్‌సిటీ మిషన్‌ చాలెంజ్‌లో రెండో విడత ఎంపిక చేసిన నగరాల్లో వరంగల్‌కు స్థానం దక్కగా , మూడో విడత కూడా కరీంనగర్‌కు అవకాశం రాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో నాలుగో విడత స్మార్ట్‌సిటీ చాలెంజ్‌లో 2017లో కరీంనగర్‌కు అవకాశం దక్కింది. రూ.1,878 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయతలబెట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రతీ బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయిస్తూ వస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్‌రోడ్ల కోసం కేటాయించిన రూ.217.50 కోట్లు నిధులను మూడు ప్యాకేజీలుగా విభజించి పటిష్టమైన సీసీ రోడ్లు నిర్మాణానికి వెచ్చించాల్సి ఉంది. ఇక్కడే అసలు తతంగం మొదలైంది.

రాజకీయ నేతల జోక్యం పెరిగింది. ఈ క్రమంలో తొలిసారి పిలిచిన టెండర్లకు కాంట్రాక్టర్లు ఎవరూ రాలేదు. రెండోసారి టెండర్లు పిలవగా, మూడో ప్యాకేజీ కింద హౌజింగ్‌ బోర్డు కాలనీ రోడ్ల పనులకు మాత్రమే సింగిల్‌ టెండర్‌ రాగా, ఆమోదం పొందింది. 1, 2 ప్యాకేజీలకు సంబంధించిన టెండర్ల విషయంలో కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో గత ఫిబ్రవరిలో మూడో విడత ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచిన అధికారులు మరో మూడు రోజుల గడువు మిగిలి ఉన్న సమయంలో రెండో విడత టెండర్ల కేసు కోర్టులో ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా గత నెల చివరి వారంలో హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమక్షంలో ఆన్‌లైన్‌ టెండర్లను తెరిచి రాజరాజేశ్వర కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి రెండు ప్యాకేజీలు అప్పగించారు.  

అభ్యంతరం చెబుతున్న ఎంపీ సంజయ్‌ 
మూడో విడత టెండర్లు పిలిచి, వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఆన్‌లైన్‌లో వచ్చిన టెండర్లను ఎలా పరిగణలోకి తీసుకుంటారని ఎంపీ సంజయ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘వాయిదా వేసిన టెండర్లకు తిరిగి సమయం ఇస్తే ఆసక్తి ఉన్నవారు టెండర్లు దాఖలు చేసేవారు. సింగిల్‌ టెండర్‌ మాత్రమే ఎందుకు దాఖలవుతుంది’ అని ఆయన ప్రశ్న. పారదర్శకంగా వ్యవరించని కారణంగా విచారణ జరిపి ఈ టెండర్లను రద్దుచేసి, తిరిగి టెండర్లు పిలవాలని ఆయన సూచిస్తున్నారు.

అయితే మూడు సార్లు టెండర్లు పిలిచిన నేపథ్యంలో సింగిల్‌ టెండర్‌ను కూడా ఖరారు చేసే అధికారం టెండర్ల కమిటీకి ఉంటుందని, రూ.164 కోట్ల విలువైన రెండు ప్యాకేజీలకు ఒకే టెండర్‌ రావడంతో ఆమోదం తెలిపినట్లు కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ ఎండీ స్పష్టం చేశారు. అయితే అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై ఒకే వ్యక్తికి టెండర్లు దక్కేలా పావులు కదిపారని ఎంపీ సంజయ్‌ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖలకు చెందిన అధికారులకు, స్మార్ట్‌సిటీ మిషన్‌కు, కేంద్ర విజిలెన్స్‌కు కూడా లేఖలు రాశారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన నగర పాలక సంస్థ మాజీ నేత ఒకరు కూడా ఈ టెండర్ల వ్యవహారం లోపభూయిష్టంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.  

మొదలైన స్మార్ట్‌సిటీ పనులు 
స్మార్ట్‌రోడ్ల ప్రాజెక్టుల్లో భాగంగా రాజరాజేశ్వరి కన్‌స్ట్రక్షన్స్‌ దక్కించుకున్న ప్యాకేజీ 1, 2 పనులకు సంబంధించి ఇటీవలే వర్క్‌ ఆర్డర్‌ వచ్చింది. దీంతో గురువారం సదరు కాంట్రాక్టు కంపెనీ విద్యానగర్‌లోని సురక్ష టవర్స్‌ వద్ద పనులు ప్రారంభించగా, మంత్రి గంగుల కమలాకర్‌ పరిశీలించారు. స్మార్ట్‌రోడ్ల పనులు వేగంగా సాగాలని అధికారులను ఆదేశించారు. 24 రోడ్ల పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తయ్యేలా కాంట్రాక్టు కంపెనీ కృషి చేయాలని సూచించారు. కాగా ఓవైపు మంత్రి కమలాకర్‌ రోడ్ల పనులు వేగంగా పూర్తిచేయాలనే పట్టుదలతో ఉండగా, మరోవైపు ఎంపీ సంజయ్‌ టెండర్ల వ్యవహారంలో జరిగిన అవినీతి, అక్రమాలను విచారించాలని పట్టుపడుతున్నారు. పనులు ప్రారంభమైన దశలో ఏం జరుగుతుందో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహానగరమా మళ్లొస్తా

ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ బంద్‌

మామ చితి వద్దే కుప్పకూలిన అల్లుడు

బోరుమన్న బోరబండ

పుట్టిన ఊరు కన్నతల్లితో సమానం  

బందోబస్తు నిర్వహించిన ప్రతాప్‌

పల్లెల అభివృద్ధికి కమిటీలు

సాగు విస్తీర్ణంలో ఫస్ట్‌..! 

85% మెడికోలు ఫెయిల్‌

వారంలో వెయ్యికిపైగా  డెంగీ కేసులా?

గవర్నర్‌ను కలసిన బండారు దత్తాత్రేయ  

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ అలక!

కమలదళం వలస బలం! 

సిరిచేల మురి‘‘పాలమూరు’’

...నాట్‌ గుడ్‌!

‘ఇప్పటికి  అద్దె  బస్సులే’

‘పనిచేయని సర్పంచ్‌కు చెత్తబుట్ట సన్మానం’ 

మన ‘గ్రహ’బలం ఎంత?

గ్రామపంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం 

సభ్యత్వం, శిక్షణపై ప్రత్యేక దృష్టి : ఉత్తమ్‌

టీబీజీకేఎస్‌ నేత రాజీనామా? 

ప్రశాంతంగా నిమజ్జనం : డీజీపీ

‘యూరియా పంపిణీలో క్షణం వృథా కానివ్వం’

‘హిందువుల ఐక్యతకు చిహ్నం ఈ ఉత్సవాలు’

గిట్టుబాటే లక్ష్యం : మంత్రి గంగుల

మీతోనే అభివృద్ధి : సబితా ఇంద్రారెడ్డి 

ఫిల్మ్‌ నగర్‌ గణపతి లడ్డూ సరికొత్త రికార్డు

ఈనాటి ముఖ్యాంశాలు

‘ప్రశాంతంగా గణేష్‌ నిమజ్జనం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?

ప్రేమలో ఉన్నా.. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి!

ఆ దర్శకుడిపై కేసు వేస్తా: జయలలిత మేనల్లుడు

హ్యాట్రిక్‌కి రెడీ

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

ఫుల్‌ జోష్‌