ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వ స్పందన?!

20 Nov, 2019 18:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఆర్టీసీ కార్మికులు 47 రోజులపాటు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె ఎట్టకేలకు ముగిసింది. గత అక్టోబర్‌ 4వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన సమ్మెలో దాదాపు 50వేలమంది కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం విధుల్లో చేరాలని రెండుసార్లు గడువు విధించినప్పటికీ.. కార్మికులు పెద్దగా చలించలేదు. కొంతమంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. ఆర్టీసీ కార్మికుల్లో ఎక్కువశాతం దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. వారు నెలన్నరకుపైగా తమకు వచ్చే జీతాలను సైతం పణంగా పెట్టి సమ్మె చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం ముందుకు, సమాజం ముందుకు తీసుకురాగలిగారు.

ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా.. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, నిత్యావసరాల ఖర్చులు ఇలా అనేక సమస్యలు వెంటాడినా కార్మికులు మూకుమ్మడిగా నిలబడి ఉద్యమం చేశారు. ఈ సమ్మెకాలంలో పలువురు కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోయి.. ఆత్యహత్యలు చేసుకున్నారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులు తమ సమ్మెను విరమణకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, మళ్లీ సమ్మెకు పూర్వం ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం కల్పించాలని, విధుల్లోకి చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది.

సుదీర్ఘ సమ్మె నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమించి.. తిరిగి విధుల్లోకి చేరేందుకు సమ్మతించిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ సమ్మె విషయంలో ఒకింత చురుగ్గా వ్యవహరించారు. పలుమార్లు సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కాపాడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవంటూ ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను అంగీకరించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు.

ఆర్టీసీ సమ్మె వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, వెంటనే విధుల్లోకి చేరాలని సీఎం కేసీఆర్‌ గతంలో రెండుసార్లు కార్మికులకు డెడ్‌లైన్‌ విధించారు. ఆ డెడ్‌లైన్లకు పెద్దగా కార్మికుల నుంచి స్పందన రాలేదు. కానీ, హైకోర్టు ఉత్తర్వులు, మారిన పరిస్థితుల నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమణకు ఒప్పుకోవడంతో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందని ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం కోరినట్టు బేషరతుగా విధుల్లోకి చేరేందుకు కార్మికులు ముందుకొచ్చారు. అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను సైతం కార్మికులు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత ఇరకాటంలో నెట్టింది. ప్రజలు కూడా ఇబ్బందుల పాలయ్యారు. ముఖ్యంగా దసరా పండుగ సమయంలో సమ్మె చేపట్టడం.. పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవ్వడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. అయితే, 50వేలమంది కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు వారికి విధుల్లో చేరేందుకు గడువు ఇచ్చింది. తాజాగా కూడా ప్రభుత్వం కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కార్మికులను బేషరతుగా ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంటుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.

మరిన్ని వార్తలు