జెరెమి బెంథాం.. ప్రజెంట్‌ సార్‌..

30 Aug, 2018 03:53 IST|Sakshi

ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగుతోంది.. ఇలాంటి ముఖ్యమైన మీటింగ్‌లకు ఎవరు అటెండ్‌ అయినా.. కాకున్నా ‘ఈయన’ తప్పనిసరిగా హాజరవుతాడు. ఫొటోలో ఉన్నవాళ్లలో కాస్త తేడాగా కనిపిస్తున్నాడే.. ఆ ఆయనే.. టోపీ పెట్టుకుని.. సరిగ్గా గుర్తుపట్టేశారే.. మనోడు కాస్త ఓల్డ్‌ ఫ్యాషన్డ్‌ లెండి.. అందుకే అప్పటి కాలం దుస్తులు.. అయితే.. మీటింగ్‌కు ఠంచనుగా వస్తాడన్న మాటే గానీ.. ఒక్క ముక్క మాట్లాడడు.. ఎవరేమన్నా బదులివ్వడు.. ముఖ్యమైన నిర్ణయాలపై జరిగే ఓటింగ్‌లోనూ పాల్గొనడు.. ఎందుకంటారా? ఎందుకంటే.. మనోడు బతికిలేడు కాబట్టి.. చచ్చి ఇప్పటికే 186 ఏళ్లు గడిచిపోయాయి కాబట్టి..

జెరెమి బెంథాం.. 18వ శతాబ్దపు ప్రముఖ తత్వవేత్త, సామాజిక సంస్కరణల ఉద్యమకారుడు.. అప్పట్లో ఈయనకు చాలా పేరుండేది. భావప్రకటన హక్కు, వ్యక్తిగత, ఆర్థిక స్వాతంత్య్రం, మహిళలకు సమాన హక్కులు, బానిసత్వం రద్దు ఇలా చాలా వాటిపై తన గళాన్ని గట్టిగా వినిపించడమే కాకుండా.. వాటి కోసం పోరాడేవాడు. అంతేనా.. వన్యప్రాణులకు హక్కులుంటాయని వాదించిన తొలితరం ఉద్యమకారుల్లో జెరెమి ఒకడు. మేధావిగా కీర్తి గడించాడు. యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. 1832లో మరణించాడు. అయితే.. చనిపోయే ముందు అతడో చిత్రమైన వీలునామా రాశాడు..

ఏమిటా వీలునామా?
జెరెమి నాస్తికుడు.. పునర్జన్మలు వంటివి నమ్మడు. దీంతో ఖననం చేయొద్దని చెప్పేశాడు. తన మృతదేహం కూడా సమాజానికి ఉపయోగపడాలని భావించి.. చనిపోయిన తర్వాత దాన్ని పరిశోధనల నిమిత్తం వాడుకోవచ్చని చెప్పాడు. అయితే.. తన శరీరాన్ని కోశాక.. అందులోని అస్థిపంజరాన్ని తీసి.. దానికి తానెప్పుడూ ధరించే దుస్తులు వేసి.. తాను కూర్చునే కుర్చీలోనే కూర్చోబెట్టాలని కోరా డు. తన తలను మాత్రం ప్రత్యేక రసాయనాలతో సంరక్షించి.. దానికి తగిలించాలని చెప్పాడు. అయితే.. ఆ సందర్భంగా జరిగిన కొన్ని తప్పిదాల వల్ల దాన్ని సరిగా సంరక్షించడం వీలు కాలేదు. దీంతో మైనంతో అతడి తలను తయారుచేసి పెట్టారు. అదెలా ఉన్నా.. ఎండుగడ్డితో నింపిన ఆ బొమ్మలో ఉన్న అస్థిపంజరం మాత్రం అప్పటి జెరెమి బెంథాందే కావడం గమనార్హం.


స్టోర్‌ రూమ్‌లో ఉన్న తల

ఇంతటితో మనోడి వీలునామా ఆగిందా లేదే.. ఇంకా ఉంది.. అదేంటంటే.. తన మిత్రులు, శిష్యులు నిర్వహించే ముఖ్యమైన పార్టీలు, సమావేశాలకు తనను కూడా తీసుకెళ్లాలని షరతు పెట్టాడు. దీంతో కాలేజీలో జరిగే ప్రతి సమావేశానికి ‘అతడు’ హాజరవుతున్నాడనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే.. కాలేజీ వాళ్లు దీన్ని ఖండిస్తున్నారు. ‘యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ 100, 150వ వార్షికోత్సవాలప్పుడు జరిగిన ముఖ్యమైన కౌన్సిల్‌ సమావేశాలకు మాత్రమే అతడు ‘వచ్చాడు’.  చివరి సారిగా 2013లో వర్సిటీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి రిటైర్‌మెంట్‌ సందర్భంగా జరిగిన భేటీకి హాజరయ్యాడు’ అని వర్సిటీ ప్రతినిధి తెలిపారు. మిగతా టైములో జెరెమి కాలేజ్‌లో ఉన్న ఓ చెక్క బీరువాలో ఉంటాడు. ముఖ్యమైన భేటీ ఉంటే.. కాలేజీ సిబ్బంది వచ్చి అతడిని తీసుకెళ్తారు. ఆ మధ్య వరకూ అతడి ఒరిజినల్‌ తల అతడి కాళ్ల వద్దే ఉండేది. అయితే.. కాలేజీలోని పెంకి కుర్రాళ్లు.. దాన్ని దొంగిలించి.. తిరిగి ఇవ్వడానికి డబ్బులివ్వాలంటూ వర్సిటీ వాళ్లనే బెదిరించేసరికి.. జెరెమి తలను జాగ్రత్తగా స్టోర్‌ రూంలో దాచిపెట్టారట.

ప్రస్తుతం మనోడు.. కాలేజీలోని ఆ చెక్క బీరువాలోనే చెక్క భజన చేస్తున్నాడు.. మరో మీటింగ్‌కు వెళ్లడానికి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు..
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌..

మరిన్ని వార్తలు