అంతా పదిలమే..

4 Apr, 2019 08:40 IST|Sakshi
సికింద్రాబాద్‌లోని ఓ సెంటర్‌ వద్ద విద్యార్థిని..

ప్రశాంతంగా ముగిసిన టెన్త్‌ పరీక్షలు

ఊపిరి పీల్చుకున్న  విద్యాశాఖ అధికారులు

ఈ నెల 15 నుంచి మూల్యాంకనం

మే మొదటి వారంలో ఫలితాల విడుదల

సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి ఘటనలు లేకుండా ఎగ్జామ్స్‌ ముగియడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పరీక్షలు ముగిసిన విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం జిల్లాలో తార్నాకలోని సెయింట్‌ ఆన్స్, సికింద్రాబాద్‌ వెస్లీ కేంద్రాలను ఎంపిక చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి పేపర్‌ వాల్యుయేషన్‌ ప్రారంభించి మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశమున్నట్టు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 70,009 మంది రెగ్యులర్, 960 ప్రైవేటు విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వీరిలో చివరి రోజు బుధవారం నిర్వహించిన థర్డ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2 పరీక్షకు 494 మంది రెగ్యులర్, 314 మంది ప్రైవేటు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 45,528 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, చివరిరోజు 181 మంది విద్యార్థులు డుమ్మా కొట్టారు. మేడ్చల్‌ జిల్లాలో 43,532 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 204 మంది చివరిరోజు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇదిలా ఉంటేవేసవి సెలవుల్లో ఇతర భాషలు, కంప్యూటర్‌ కోర్సుల్లో శిక్షణ పొందడం వల్ల భవిష్యత్‌లో సబ్జెక్టుపై మరింత పట్టు సాధించవచ్చని ఉపాధ్యాయ, అధ్యాపక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

12 నుంచి వేసవి సెలవులు
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఇప్పటికే ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. వీరికి వార్షిక పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. మరో నాలుగైదు రోజుల్లో పరీక్షలు ముగియనున్నాయి. అనంతరం రెండు మూడు రోజుల్లోనే ఫలితాలు కూడా వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ఆయా తరగతుల విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ ప్రకటించింది.  

మరిన్ని వార్తలు