మీ సేవలకు ధన్యవాదాలు

27 Dec, 2018 10:23 IST|Sakshi
డీసీపీకి ధన్యవాదాలు చెబుతున్న చిన్నారి

సాక్షి, సిటీబ్యూరో: రోటీన్‌కు భిన్నంగా నగర పోలీసు వార్షిక విలేకరుల సమావేశాన్ని పాతబస్తీలోని చౌ మొహల్లా ప్యాలెస్‌లో ఏర్పాటు చేయాలని కొత్వాల్‌ అంజనీకుమార్‌ నిర్ణయించారు. ఈ బాధ్యతల్ని ఇన్‌చార్జ్‌ డీసీపీగా ఉన్న ఈస్ట్‌ జోన్‌ డీసీపీ ఎం.రమేష్‌కు అప్పగించారు. బుధవారం ఈ కార్యక్రమం జరుగనుండటంతో ఆయన మంగళవారం ప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా ఓ చిన్నారి ఆయన వద్దకు వచ్చింది. షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ ‘«థ్యాంక్స్‌ ఫర్‌ యువర్‌ సర్వీస్‌’ అంటూ చెప్పింది. అది విన్న ఆయన ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ పాప వెంటే వచ్చిన ఆమె కుటుంబీకులు అసలు విషయం డీసీపీ రమేష్‌కు వివరించారు. బెంగళూరుకు చెందిన ఐదేళ్ల ఆ చిన్నారి పేరు శివాని.

ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న ఆమెకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పోలీసులను గౌరవించడం నేర్పారు. సమాజం కోసం వారు చేస్తున్న సేవల్ని వివరించారు. దీంతో శివానీకి పోలీసులంటే వల్లమానిన గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి. యూనిఫాంలో ఉన్న అధికారులు, సిబ్బంది ఎక్కడ కనిపించినా వారి వద్దకు వెళ్లి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడంతో పాటు ‘థ్యాంక్స్‌ ఫర్‌ యువర్‌ సర్వీస్‌’ అని చిరునవ్వుతో చెప్తుంది. మంగళవారం చౌమొహల్లా ప్యాలెస్‌లో ఉన్న డీసీపీ రమేష్‌ను ఈ అనుభవం ఎదురైంది. నగరంలో నివసిస్తున్న తాత–నానమ్మల దగ్గరకు శివానీ తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. వారంతా కలిసి ప్యాలెస్‌ చూడటానికి అక్కడకు వచ్చారు. ఈ చిన్నారికి తల్లిదండ్రులు నేర్పిన విషయాన్ని గమనించిన డీసీపీ రమేష్‌ వారి కుటుంబంలో ఎవరైనా పోలీసులు ఉండి ఉంటారని, అందుకే ఇలా నేర్పించి ఉంటారని భావించారు. ఈ విషయంపై ఆరా తీయగా శివాని తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు సైతం ప్రొఫెసర్లు, టీచర్లుగా పని చేసిన, చేస్తున్న వారే. అయినప్పటికీ పోలీసుల విధులు అంటే వారికి అత్యంత గౌరవం. దీన్నే శివానీకి ఆ తల్లిదండ్రులు నేర్పారు.  

మరిన్ని వార్తలు