పది 'పల్టీ'

14 May, 2019 10:48 IST|Sakshi
తల్లిదండ్రులతో రిషిక , ఎం.శ్రావ్య

ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ.. దిగజారిన ర్యాంకులు

21వ స్థానంలో మేడ్చల్‌.. 22వ స్థానంలో రంగారెడ్డి

చివరి(31వ) స్థానంలో హైదరాబాద్‌ జిల్లా

ఈ ఏడాది కూడా బాలికలదే పైచేయి

25 ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత

సాక్షి, సిటీబ్యూరో/మేడ్చల్‌: పదో తరగతి ఫలితాల్లో ఇతర జిల్లాలతో పోలిస్తే గ్రేటర్‌ జిల్లాలు మరింత వెనుకబడిపోయాయి. గతంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ...రాష్ట్ర స్థాయిలో జిల్లాల ర్యాంకింగ్‌ మరింత దిగజారింది. గత ఏడాది మేడ్చల్‌ జిల్లా 13వ స్థానంలో నిలవగా, ఈ సారి 21వ స్థానానికి...రంగారెడ్డి జిల్లా 16వ స్థానం నుంచి 22వ స్థానానికి దిగజారింది. అక్షరాస్యతలో అందరికంటే ముందున్న హైదరాబాద్‌ జిల్లా గత ఏడాది 25వ స్థానంలో ఉండగా, ఈసారి ఆఖరి(31వ) స్థానానికి పడిపోయింది. ఇక హైదరాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది పరీక్షకు మొత్తం 70,173 మంది విద్యార్థులు హాజరుకాగా, వీరిలో 58,306 మంది విద్యార్థులు (83.09శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 45,747 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, వీరిలో 42,467 మంది (92.83 శాతం) ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్‌ జిల్లా పరిధిలో మొత్తం 42,753 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 39,753 మంది విద్యార్థులు(92.98 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 

మూడు జిల్లాల్లోనూ బాలికలదే హవా..
గ్రేటర్‌ పరిధిలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బాలురతో పోలిస్తే బాలికలే ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 34,517 మంది బాలురు పరీక్ష రాయగా, వీరిలో 27,237 మంది (78.91శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక 35,656 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా, వీరిలో 31,069 మంది (87.14 శాతం)ఉత్తీర్ణత సాధించారు. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో 23,651 మంది బాలురు పరీక్ష రాయగా, వీరిలో 21,656 మంది (91.56శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక బాలికలు 22,096 మంది బాలికలు పరీక్ష రాయగా, వీరిలో 20,811 మంది (94.18శాతం)ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్‌ జిల్లా పరిధిలో 22,340 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా, 20,511 మంది (91.81శాతం) ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా 20,413 మంది బాలికలకు, 19,242 మంది(94.26శాతం)ఉత్తీర్ణత సాధించి తమ ఆధిక్యతను చాటుకున్నారు.  

25 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఫలితాలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 25 ప్రభుత్వ పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాల–తాడ్‌బండ్, ప్రభుత్వ బాలికల పాఠశాల– షాలిబండ, ప్రభుత్వ సిటీ బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల–మెఘల్‌పుర, ప్రభుత్వ బాలుర అంధ పాఠశాల–దారుషిఫా, ప్రభుత్వ పాఠశాల–మొఘల్‌ పురా–1, ప్రభుత్వ పాఠశాల–ఖాజిపురా, ప్రభుత్వ పాఠశాల–అఫ్జల్‌గంజ్, ప్రభుత్వ బాలుర పాఠశాల–దారుషిఫా, ప్రభుత్వబాలికల పాఠశాల–ఫలక్‌నుమా, ప్రభుత్వ బాలుర పాఠశాల–చాంద్రాయణగుట్ట, ప్రభుత్వ బాలుర పాఠశాల–మైసారం, ప్రభుత్వ బాలికల పాఠశాల–డబీర్‌పురా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పాఠశాల–టీఈజీఏ, ప్రభుత్వ బాలికల పాఠశాల–ముస్తైద్‌పుర, ప్రభుత్వ బాలుర పాఠశాల–అంబర్‌పేట్, ప్రభుత్వ డెఫ్‌ పాఠశాల–మలక్‌పేట్, ప్రభుత్వ హెచ్‌ఎస్‌ అజంపుర– గోల్నాక, జీజీహెచ్‌ఎస్‌–ఎన్‌బీటీ నగర్, ప్రభుత్వ పాఠశాల–జమిస్తాన్‌పూర్, ప్రభుత్వ పాఠశాల –బాగ్‌ముసారంబాగ్, ప్రభుత్వ బాలికల పాఠశాల– న్యూ ముసారంబాగ్,  ప్రభుత్వ బాలికల అంధ పాఠశాల–మలక్‌పేట్, న్యూ ప్రభుత్వ హైస్కూల్‌–వైఎంసీఏ సికింద్రాబాద్, ప్రభుత్వ పాఠశాల –సికింద్రాబాద్‌ మార్కెట్‌ పాఠశాలల్లో కూడా వంద శాతం ఫలితాలు సాధించారు. మరో 24 పాఠశాలలు 40 శాతం లోపు ఫలితాలతో వెనుకబడిపోయాయి. వీటిలో రెండు పాఠశాలల్లో జీరో శాతం ఫలితాలు నమోదు కావడం గమనార్హం. 

టాపర్‌ @ ఆటో డ్రైవర్‌
 బొల్లారం ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన ఎం.శ్రావ్య టెన్త్‌ ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధించి మారేడుపల్లి మండలంలోనే టాపర్‌గా నిలిచింది. తండ్రి భిక్షపతి ఆటో డ్రైవర్‌ కాగా..తల్లి బాలలక్ష్మి దూలపల్లి గ్రామపంచాయతీలో బిల్‌ కలెక్టర్‌. మేడ్చల్‌ మండలం మునీరాబాద్‌లో నివాసం. శ్రావ్య టాపర్‌గా నిలవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వీరలక్ష్మి, టీచర్లు అభినందించారు. తమ కూతుర్ని బాగా చదివిస్తామని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

ఇంజినీర్‌నవుతా...
నేను మల్కాజిగిరి ఆర్‌.కె నగర్‌లోని నేషనల్‌ హైస్కూల్‌లో ఒకటి నుంచి టెన్త్‌ వరకు చదివాను. టెన్త్‌లో పదికి పది జీపీఏ సాధించాను. ఈ స్కూల్‌లో అందరూ నిరుపేద విద్యార్థులే ఉన్నారు. నాన్న సురేందర్‌ జీహెచ్‌ఎంసీలో అటెండర్‌. అమ్మ సత్యలక్ష్మి. మాది పేద కుటుంబం. కష్టపడి చదివి ఉత్తమ మార్కులు సాధించాను. అమ్మా నాన్నల ఆశలకనుగుణంగా భవిష్యత్‌లోనూ బాగా చదువుకుని ఇంజినీర్‌ అవుతాను. నా విజయానికి సహకరించిన పాఠశాల యాజమాన్యానికి, టీచర్లకు కృతజ్ఞతలు.     – రిషిక,(10/10 జీపీఏ )

మరిన్ని వార్తలు