విద్యార్థినికి కన్నీటి పరీక్ష

17 Mar, 2018 09:35 IST|Sakshi
పరీక్ష రాస్తున్న మౌనిక

ఛాతీ నొప్పితో చనిపోయిన తండ్రి

బంధువులు ధైర్యం చెప్పడంతో పదో తరగతి పరీక్ష రాసిన మౌనిక

నిజాంసాగర్‌(జుక్కల్‌): ఏడాది నుంచి పుస్తకాలతో కుస్తీ పట్టిన కస్తూర్బా విద్యార్థినికి పదో తరగతి పరీక్ష కన్నీటి పరీక్ష అయ్యింది. పరీక్షకు సన్నద్ధం అయిన కూతురికి ధైర్యం చెప్పి, పరీక్ష సెంటర్‌లోకి సాగనంపిన తండ్రి శాశ్వతంగా దూరమయ్యాడు. ఇంట్లో తండ్రి శవం.. పుట్టెడు దుఖంతో కన్నీళ్లను దిగమింగుతూ విషాదవదనంతో పదో తరగతి పరీక్ష రాసింది మౌనిక. వివరాలు.. ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మైలారం కృష్ణ (44)కు ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న కృష్ణ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. రెండో కూతురు మౌనిక నిజాంసాగర్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతుంది. గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో కృష్ణ తన కూతురి పరీక్ష కోసం నిజాంసాగర్‌ మండల కేంద్రానికి వచ్చాడు.

కస్తూర్బా నుంచి తోటి విద్యార్థినులతో కలిసి వచ్చిన మౌనిక పరీక్ష కేంద్రం వద్ద తండ్రితో కొద్దిసేపు గడిపింది. అనంతరం కృష్ణ తన కూతురికి ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపాడు. కూతురి కోసం నిజాంసాగర్‌ మండల కేంద్రంలోనే ఉన్న కృష్ణకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. అదే సమయంలో మౌనిక పరీక్ష పూర్తవడంతో బయటకు వచ్చింది. తండ్రి అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించి స్థానికుల సహాయంతో కృష్ణను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అయితే అస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ మృతి చెందాడు. తండ్రి మృతితో రాత్రంతా రోదించిన మౌనికకు బంధువులు ధైర్యం చెప్పారు. తండ్రి మరణాన్ని తట్టుకొలేని మౌనికకు కుటుంబీకులు ధైర్యం చెప్పడంతో శుక్రవారం నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి వచ్చింది. బంధువుల సహకారంతో తెలుగు పరీక్ష –2 రాసిన అనంతరం మౌనిక తండ్రి అంత్యక్రియలకు వెళ్లింది. మృతుడికి ఐదుగురు కూతుళ్లు ఉండగా మౌనిక రెండో కూతురు.

మరిన్ని వార్తలు