10-12 రోజుల్లో టెన్త్‌ ఫలితాలు

10 Jun, 2020 05:03 IST|Sakshi

ఎస్‌ఎస్‌సీ బోర్డు కసరత్తు 

పరీక్షల రద్దును కోర్టుకు తెలపడంపై ఏజీతో స్పెషల్‌ సీఎస్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా టెన్త్‌ విద్యార్థులను పాస్‌ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఫలితాల వెల్లడిపై ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టి పెట్టింది. తమ వద్ద ఉన్న విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కులను ప్రాసె స్‌ చేసే ప్రక్రియను 10–12 రోజుల్లో పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా ఫలితాలను వెల్లడించేందుకు అవసరమైన ఉత్తర్వుల జారీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉత్తర్వు ల్లో ఉండాల్సిన మార్గదర్శకాలపై చర్చించింది.

మంగళవారం రాత్రి లేదా బుధవారం ఇవి వెలువడే అవకాశం ఉంది. వాటితోపాటు కోర్టులోనూ కేసు ఉన్నందున కోర్టుకు తెలియజేయాల్సిన అంశాలపైనా అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)తో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్‌ చర్చించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్‌ఎంసీలోని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పగా ప్రభుత్వం పరీక్షలనే రద్దు చేసింది. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేయాలని అధికారులు నిర్ణయించారు.

పారదర్శకంగానే ఫలితాలు: మంత్రి సబిత
పదో తరగతి ఫలితాలు పారదర్శకంగా ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి శేఖర్‌రావు, మధుసూదన్‌ తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలోనే ఫలితాలను ప్రకటిస్తామన్నారు. విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కులను స్కూళ్ల యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో పంపినందున ఆ మార్కులను ఎవరూ మార్చే ప్రయత్నం చేయడం సాధ్యం కాదన్నారు. ఆన్‌లైన్‌లో అందిన మార్కులకు సైబర్‌ భద్రత ఉందని, తద్వారా ఫలితాల్లో పారదర్శకత ఉంటుందన్నారు. విద్యార్థులకు ఇంటర్నల్స్‌లో వచ్చిన వాస్తవ మార్కుల ఆధారంగా నే ఫలితాలు ఉంటాయని ఆమె వివరించారు.

మరిన్ని వార్తలు