9.35 వరకు అనుమతి..

16 Mar, 2019 02:28 IST|Sakshi

5 నిమిషాలే గ్రేస్‌ పీరియడ్‌ 

8.45 గంటల నుంచే కేంద్రాల్లోకి రావొచ్చు 

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు 

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,52,302 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం అవుతాయని, విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. పరీక్షల నిర్ణీత సమయం తర్వాత 5 నిమిషాల వరకే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని, ఉదయం 9.35 గంటల తర్వాత అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. హాల్‌టికెట్‌ పోగొట్టుకుంటే  www. bse. telangana. gov. in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షలకు హాజరు కావొచ్చని తెలిపారు.

పరీక్షలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తితే 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్‌ రూంకు (040–23230942) ఫోన్‌చేసి తెలపాలని సూచించారు. పరీక్ష రాసేందుకు అవసరమైన రైటింగ్‌ ప్యాడ్, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేల్‌ వెంట తీసుకెళ్లాలని, ఓఎంఆర్‌ షీట్‌ తమదేనా.. కాదా అని సరి చూసుకొని పరీక్ష రాయాలన్నారు. మెయిన్‌ ఆన్సర్‌ షీట్‌పై ఉన్న సీరియల్‌ నంబర్‌ను మాత్రమే అడిషనల్‌ షీట్లు, గ్రాఫ్, మ్యాప్, బిట్‌ పేపర్లపై వేయాలని వివరించారు. సెల్‌ఫోన్, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు హాల్లోకి తీసుకెళ్లొద్దని, హాల్‌టికెట్‌ తప్ప మరే కాగితాలు వెంట తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. పేరు, సంతకం, గుర్తింపు చిహ్నాలు, స్లోగన్లు జవాబు పత్రంలో ఎక్కడా రాయొద్దని సూచించారు.

మరిన్ని వార్తలు