నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం

2 Apr, 2018 06:52 IST|Sakshi
జిల్లా కేంద్రంలోని స్పాట్‌ కేంద్రమైన సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌

హాజరుకానున్న 2314 మంది ఉపాధ్యాయులు

స్పాట్‌ బహిష్కరణ వాయిదా

ఆదిలాబాద్‌టౌన్‌ : పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి ఈనెల 13వరకు జిల్లా కేంద్రంలోని సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌ పాఠశాలలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా పరిధిలోని 2,314 మంది ఉపాధ్యాయులకు విధులు అప్పగించారు. 11 మంది ఏసీఓలను, 1524 మంది ఏఈలను, 259 సీఈలను 520 స్పెషల్‌ అసిస్టెంట్లను నియమించారు. 24 జిల్లాలకు సంబంధించి 5,64,626 జవాబు పత్రాలను జిల్లాకు కేటాయించారని పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ అనురాధ తెలిపారు. తెలుగు, ఉర్దూ జవాబు పత్రాలు 90,233, హింది 68,450, ఆంగ్లం 65,196, గణితం 98,794, సామాన్యశాస్త్రం 98,215, సాంఘిక శాస్త్రం 1,43,739 జవాబు పత్రాలను జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. డీఈవో క్యాంప్‌ ఆఫీసర్‌గా, డెప్యూటీ ఈఓ, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. మూల్యాంకనం ఉదయం 9 నుంచిమధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు జరగనుంది. రోజుకో ఉపాధ్యాయుడికి 40 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేసేందుకు ఇవ్వనున్నారు.  

స్పాట్‌ బహిష్కరణ వాయిదా..
స్పాట్‌ బహిష్కరిస్తామని ప్రకటించిన ఉపాధ్యాయ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం రాత్రి చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో స్పాట్‌ బహిష్కరణ వాయిదా వేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. 34 డిమాండ్లతో జాయింట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్స్‌ యూనియన్‌ గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. చర్చలు జరిపిన డెప్యూటీ సీఎం త్వరలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో స్పాట్‌ యథావిధిగా జరగనుంది. కాగా డీటీఎఫ్‌ సంఘం స్పాట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించింది. 

మరిన్ని వార్తలు