ఆధార్‌ నమోదులో చేతివాటం

11 Oct, 2018 08:11 IST|Sakshi

జ్యోతినగర్‌(రామగుండం): నేడు ఆధార్‌ అంటే అందరికీ అవసరమైన కార్డు ..ఏ అవసరానికైనా మొదటగా ఉపయోగపడేది ఆధార్‌ కార్డు అంటే అతిశయోక్తి కాదు. దీనిని పొందడానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రం ఎక్కడా అమలు కావడం లేదు. సేవలు చేయడానికే అంటూ బోర్డులు ఏర్పాటు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లలకు పాల్పడుతున్నారు. చదువు రాని వారు వస్తే చాలు ఇక ఎంత వీలుంటే అంతా లాగేసుకోవడమే..ఇలా అమాయకుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ విషయం ఎవరికి చెప్పాలన్నా ఆధారాలుండవు. దీంతో పోనీలే అనుకుంటున్నారు వినియోగదారులు. కానీ సిబ్బంది మాత్రం రోజుల తరబడి ఇదే పనిలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గోదావరిఖని ప్రాంతంలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనులకు వచ్చిన ఇతర రాష్ట్రాల వారి వద్ద నుంచి అందినకాడికి దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినియోగదారులు కోరుతున్నారు.

గుర్తింపును ధ్రువీకరించే పత్రాలు
రేషన్‌కార్డు, పాస్‌పోర్టు, పాన్‌ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్టు ప్రభుత్వ ఫొటో గుర్తింపు కార్డు, జాబ్‌ కార్డు, గుర్తింపు పొందిన విద్యా సంస్థచే జారీ చేయబడిన కార్డు, ఆయుధాల లైసెన్సు, ఫొటో ఉన్న బ్యాంకు ఏటీఎం, పింఛన్‌దారు కార్డు, స్వాతంత్య్ర సమరయోధుల కార్డు, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్, ఇసీహెచ్‌ఎస్‌ ఫొటో కార్డు, తపాల శాఖ జారీ చేసిన పేరు, ఫొటో కలిగిన కార్డు, గ్రూఫ్‌–ఏ గెజిటెడ్‌ అధికారి తన లెటర్‌ హెడ్‌పై జారీ చేసిన ఫొటో ఉన్న గుర్తింపు పత్రం.

చిరునామా ధ్రువీకరించే పత్రాలు..
గ్రామపంచాయతీ అధికారి లేదా హోదా కలిగిన అధికారి లెటర్‌ హడ్‌పై జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రంతో పాటు పలు ధ్రువీకరణ పత్రాలు.

పుట్టిన తేదీ ధ్రువీకరించే పత్రాలు..
పేరు, పుట్టిన తేదీ ఉన్న వివరాలు కలిగిన ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పదో తరగతి పత్రం, పాస్‌పొర్టు, గ్రూఫ్‌(ఏ) అధికారి లెటర్‌ హెడ్‌ మీద జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం.

మరిన్ని వార్తలు