తడలో ఉగ్రవాదుల షెల్టర్?

4 Apr, 2015 19:31 IST|Sakshi
తడలో ఉగ్రవాదుల షెల్టర్?

నల్లగొండ: పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందిన వ్యక్తులు గతంలో నెల్లూరు జిల్లా తడలో షెల్టర్ తీసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు అస్లం అయూబ్, జాకీర్ హుస్సేన్లకు చెన్నై పేలుళ్లతో కూడా సంబధం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల ఫోటోలను నెల్లూరు పోలీసులకు పంపి వారి నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో తెలంగాణ పోలీసు యంత్రాంగం ఉంది.

సిమీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లో పోలీసులు జనవరిలోనే హై అలర్ట్ ప్రకటించారు. చెన్నై బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితులు తమిళనాడు నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్నారని నిఘావర్గాలు అప్పుడే సమాచారం అందించాయి. దీంతో జనవరిలోనే ఏపీ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

తప్పించుకున్న ఉగ్రవాదులు జాకీర్ హుస్సేన్, అంజాద్, అస్లాం, ఫయాజుద్దీన్, మహబూబ్ఉద్దు ఫోటోలను తమిళనాడు పోలీసులు అప్పుడే తడ పోలీసులకు పంపారు. దాంతో శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. దీంతో జనవరిలోనే శ్రీహరికోటలో అంతరిక్ష పరిశోధన కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా.. తాజాగా నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరిలో ఇద్దరు మరణించడం సంచలనం సృష్టించింది.

మరిన్ని వార్తలు