పరీక్షలను బహిష్కరించబోం

20 Feb, 2018 04:47 IST|Sakshi

     యథావిధిగా జరిగేలా సహకరిస్తాం 

     ప్రభుత్వంతో చర్చలు సఫలం 

     కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ 

     ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు: కడియం 

సాక్షి, హైదరాబాద్‌: పరీక్షల బహిష్కరణ నిర్ణయాన్ని తెలంగాణ కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఉపసంహరించుకుంది. పరీక్షలు యథా విధిగా జరిగేలా ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలను తక్షణం ఇవ్వకపోతే పరీక్షలను బహిష్కరణకు జేఏసీ పి లుపునివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సో మవారం ఉప ముఖ్యమంత్రి మంత్రి కడియం శ్రీహరి చాంబర్లో విద్యా సంస్థల జేఏసీ నేతలు రమణారెడ్డి, పాపిరెడ్డి, వరదారెడ్డి, నరేందర్, ఇతర నేతలు చర్చించారు. చర్చలు పూర్తిగా సఫలమయ్యాయని అనంతరం వారు మీడియాకు తెలిపారు. ‘‘మా సమస్యలను డిప్యూటీ సీఎం సావధానంగా విన్నారు. పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించారు. అందుకు మార్చి 5న భేటీ అవుతామనడం హర్షణీయం. విద్యాశాఖ పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, లేని వాటిని సీఎం కేసిఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు’’అంటూ కృతజ్ఞతలు తెలిపారు.  

ఏటా 10 శాతం ఫీజు పెంపు కోరాం 
ప్రైవేట్‌ కాలేజీలలో ఫీజులను ఏటా కనీసం 10 శాతం పెంచాలని కడియాన్ని కోరినట్టు జేఏసీ నేతలు చెప్పారు. ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలలో ఇంజనీరింగ్, ప్రొఫెషనల్‌ కాలేజీలకు ఒక పద్దు, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలు, పాఠశాలలకు ఒక పద్దుగా వేరుగా నిధు లు విడుదల చేయాలని కోరాం. కాలేజీలకు గుర్తింపునివ్వడంలో సమస్యలను వివరించాం. స్కూళ్లకు, కాలేజీలకు కరెంటు చార్జీలు, ఆస్తి ప న్ను ఎక్కువగా వేస్తున్నారని చెప్పాం.

ఫైర్‌ సేఫ్టీ నిబంధనలను 30 ఏళ్ల నాటి భవనాలకు సరళతరం చేయాలని కోరాం. చాలా సమస్యలు నిజమైనవేనని, వాటి పరిష్కారానికి ఎలాంటి ఇబ్బందీ లేదని కడియం చెప్పారు’’అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షల బహిష్కరణ పిలుపును వెనక్కు తీసుకున్నందుకు జేఏసీ నేతలకు కడియం ధన్యవాదాలు తెలిపారు. విద్యా సంస్థల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉందన్నారు. నిధుల సంబంధిత అంశాలపై సీఎంతో చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు.  

మరిన్ని వార్తలు