స్క్రాప్ దుకాణానికి పాఠ్యపుస్తకాలు

2 Feb, 2015 11:11 IST|Sakshi

పరిగి: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే పాఠ్యపుస్తకాలను విక్రయించేందుకు ఓ వ్యక్తి పరిగి లోని స్క్రాప్ దుకాణానికి తీసుకొచ్చాడు. గమనించిన స్థానికులు.. వీటిని ఎక్కన్నుంచి తెచ్చావంటూ  సదరు వ్యక్తిని నిలదీశారు. దోమ మండల విద్యావనరుల కేంద్రం సిబ్బంది అమ్మారని, మూడు క్వింటాళ్ల బరువున్నాయని చెప్పాడు. ఇదంతా చూస్తున్న చెత్త దుకాణం యజమాని వాటినికొనేందుకు నిరాకరించాడు. తిరిగి తీసుకెళ్దామంటే ఆటోవాలా సైతం నేను రానన్నాడు. ఇంతలో విషయం పోలీసులకు చేరింది.
 
 దీంతో వారు వచ్చి పుస్తకాలను పోలీస్‌స్టేషన్‌కు చేర్చారు. పుస్తకాలపై ప్రభుత్వం పంపిణీ చేసినట్టు ముద్రణ కూడా ఉంది. ఇంత పెద్దమొత్తంలో ఎక్సెస్ పుస్తకాలు ఎక్కడివ న్న విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్ మార్కెట్లో అమ్మేందుకు ఎక్కువ ఇండెంట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయమై డిప్యూటీ ఈఓ హరిశ్చందర్‌ను వివరణ కోరగా.. సిబ్బంది విక్రయించినట్టు అనుమానం ఉందని, విచారణ చేస్తామని చెప్పారు. ఏ ఏడాది పుస్తకాలైనా ఇలా అమ్మడానికి వీలులేదని చెప్పారు.

మరిన్ని వార్తలు