పల్లెకు ఐటీ తోరణం

11 May, 2017 02:33 IST|Sakshi
పల్లెకు ఐటీ తోరణం

జిల్లాకో రూరల్‌ టెక్నాలజీ సెంటర్‌ 10 వేల మందికి గ్రామీణ యువతకు శిక్షణ
మూడేళ్లలో 2,500 మందికి ఉద్యోగాలు రూరల్‌ టెక్నాలజీ పాలసీని ప్రకటించిన రాష్ట్ర సర్కారు


సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ, ఐటీ ఆధారిత రంగ సంస్థలను ప్రోత్సహించేందుకు రూరల్‌ టెక్నాలజీ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఐటీ సంస్థలను ఇకపై రూరల్‌ టెక్నాలజీ సెంటర్లుగా పరిగణించి రాయితీ, ప్రోత్సాహకాలను అందిస్తామని పేర్కొంది. ఈ మేరకు రూరల్‌ టెక్నాలజీ పాలసీని ప్రకటిస్తూ ఐటీ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 10 శాతం వాటాతోపాటు 35 లక్షల మంది ఐటీ నిపుణులకు ఐటీరంగం ఉపాధి కల్పిస్తుండగా, అందులో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలను టెక్నాలజీ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, అక్కడ సంపద, ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

10 వేల మంది గ్రామీణ యువతకు శిక్షణ
డేటా ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ, డేటా మేనేజ్‌మెంట్, డాక్యుమెంట్‌ డిజిటలైజేషన్, కస్టమర్‌ సర్వీస్, ఎంక్వైరీ హ్యాండ్లింగ్‌ తదితరాలతోపాటు వాయిస్, హెచ్‌ఆర్‌ రిలేటెడ్‌ సర్వీసెస్, ఫైనాన్షియల్‌ అకౌంటింగ్, లీగల్‌ సపోర్ట్‌ వెబ్‌ మార్కెటింగ్‌ సేవలు అందించేలా గ్రామీణ ఐటీ కేంద్రాలను తీర్చిదిద్దుతామని ప్రభుత్వం తెలిపింది. రానున్న మూడేళ్లలో పాత 10 జిల్లాల్లో ఒక్కో రూరల్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, వీటి ద్వారా కనీసం 2,500 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈ కేంద్రాలకు అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు టాస్క్‌ ద్వారా 10 వేల మంది గ్రామీణ యువతకు శిక్షణ కల్పిస్తామని తెలిపింది.  మండలం లేదా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ టెక్నాలజీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని,   స్థానికంగా కనీసం 50 వేల జనాభా ఉండాలని, సమీప పట్టణం నుంచి సదరు మండలం/గ్రామానికి కనీసం 50 కి.మీ.ల దూరం ఉండాలని ప్రభుత్వం పేర్కొంది.

ప్రోత్సాహకాలు ఇవీ..
⇒ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసే తొలి ఐదు ఐటీ కంపెనీలకు సంబంధించిన పంచాయతీ పన్నులను మొదటి మూడేళ్ల పాటు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.
⇒ ప్రచారంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఐటీ ఈవెంట్ల ఖర్చులో గరిష్టంగా రూ.5 లక్షల వరకు లేదా 50 శాతం, రెండింట్లో ఏది తక్కువైతే దాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో పాల్గొనేందుకు 50 శాతం ఎగ్జిబిషన్‌ స్టాల్‌ రెంట్‌ లేదా రూ.50 వేలు, రెండింట్లో ఏది తక్కువైతే దాన్ని ప్రభుత్వం చెల్లించనుంది.
⇒గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఐటీ కంపెనీలు ఓపెన్‌ యాక్సెస్‌ విధానంలో పునరుత్పాధక విద్యుత్‌ను రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసుకోవచ్చు.
⇒రూ.40 లక్షలకు మించకుండా 50 శాతం పెట్టుబడి రాయితీని తొలి మూడు కంపెనీలకు ప్రభుత్వం అందజేయనుంది.
⇒ మొదటగా వచ్చే మూడు కంపెనీలకు చదరపు గజానికి 25 శాతం చొప్పున మూడేళ్ల పాటు అద్దె రాయితీని అందించనుంది.
⇒తొలి మూడేళ్ల పాటు ఇంటర్నెట్, టెలిఫోన్‌ చార్జీల్లో 25 శాతాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.
⇒ టెండర్‌ దరఖాస్తు ధర, ధరావతుల చెల్లింపుల్లో 100 శాతం రాయితీ కల్పించనుంది.
⇒ నైపుణ్య అభివృద్ధి కేంద్రాల్లో ఒక వ్యక్తికి 6 నెలల శిక్షణ అందించడానికి శిక్షణ రాయితీ కింద రూ.2,500 చెల్లిస్తుంది.

మరిన్ని వార్తలు