'ఘంటా చక్రపాణిగారు.. మమ్మల్ని పట్టించుకోండి'

22 Jan, 2018 19:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఎస్‌పీఎస్సీ వెంటనే గురుకుల టీజీటీ తుది ఫలితాలను వెల్లడించాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. సోమవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో టీజీటీ అభ్యర్థులు చేరి ఆందోళనకు దిగారు. టీఎస్‌పీఎస్సీ వద్దే భైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా కాస్తంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురుకులాల్లోని (పీజీటీ, టీజీటీ) స్థాయిలోని పలు పోస్టులకు టీఎస్‌పీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో తొలుత అభ్యర్థులను 1:2 గా ఎంపిక చేశారు. ఇందులో కొద్ది రోజుల కిందటే పీజీటీ ఫలితాలను వెల్లడించారు.

కానీ, టీజీటీ ఫలితాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. అయితే, ప్రస్తుతం టీజీటీ పోస్టులకు 1:2 ప్రకారం ఎంపికైన అభ్యర్థులంతా కూడా తమకు ఉద్యోగం వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. మరోపక్క, వివిధ పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇవ్వడంతోపాటు ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు నిర్వహించనుంది. దీంతో టీజీటీ 1:2కు ఎంపికైన అభ్యర్థులు ఇటు గురుకులాలపై ఆశపెట్టుకోవాలా, టీఆర్‌టీకి చదవాలా అనే అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఇప్పటికే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తయినప్పటికీ ఫలితాల వెల్లడి విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చేస్తునే ఉన్నారు. వివిధ మార్గాల ద్వారా టీఎస్‌పీఎస్సీపై ఫలితాలకోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ టీఎస్‌పీఎస్సీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రావడంతో సోమవారం టీజీటీ 1:2 అభ్యర్థులంతా టీఎస్‌పీఎస్సీ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్న తమకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి ఉపశమనం కలిగించాలని, ఆందోళన నుంచి బయటపడేయాలని విజ్ఞప్తి చేశారు. తమ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫలితాలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై టీఎస్‌పీఎస్సీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

మరిన్ని వార్తలు