‘రెవెన్యూ శాఖను ఏ శాఖలోనూ విలీనం చేయరు’

17 Apr, 2019 17:17 IST|Sakshi
ప్రతీకాత్మక​ చిత్రం

హైదరాబాద్‌: రెవెన్యూ శాఖను ఏ శాఖలోనూ విలీనం చేయరని, ఆ విషయం ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదని  టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం లచ్చిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ‘ రెవెన్యూ శాఖలో కొత్త సంస్కరణలు వస్తున్నాయి. మనం స్వాగతించాలి. మనం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేసి ముందుకు వెళ్దాం. రెవెన్యూ ఉద్యోగులందరికోసం కలిసి పని చేద్దాం. రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం తెస్తామని చెప్పలేదు. ఉద్యమంలో కేసీఆర్‌తో మనం కూడా పని చేశాం. మన బాధలన్నీ కేసీఆర్‌కు తెలుసు. రెవెన్యూ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను ముందు ఉంటాను. కొత్త చట్టం వచ్చినా మనమే పనిచేస్తాం. ఇప్పటివరకు రెవెన్యూ శాఖను ఇతర శాఖలో కలుపుతామనలేదు. కొత్త చట్టాలు వస్తే స్వాగతించాలి. కొత్త చట్టాలు వస్తే ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదు. రెవెన్యూ శాఖపై వస్తున్న అపోహలు ఖండించాలి. ప్రభుత్వం పెద్దలు అన్నట్లు మనం కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు మేలు చెయ్యాలి. ప్రతి గ్రామంలో భూ సమస్యలు లేకుండా చెయ్యాలి. ఒకవేళ సమస్యలు ఉంటే బోర్డుపై రాయాలి. రెవెన్యూ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. పై అధికారుల ఒత్తిడికి మనం బలికావద్ద’ని వ్యాఖ్యానించారు.

రెవెన్యూ శాఖ రద్దు తప్పుడు ప్రచారం: ఈశ్వర్‌(వీఆర్‌ఎ సంఘం అధ్యక్షులు)
నిన్న తాము  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని కలిశామని, ఎక్కడ కూడా శాఖ మార్పు జరగడం లేదని ఆయన చెప్పినట్లు ఈశ్వర్‌ తెలిపారు. కొత్త చట్టం అనేది ప్రణాళికల్లో మార్పు మాత్రమేనని, కొంత కఠినంగా ఉంటుందని చెప్పారు. కొన్ని సంఘాలు స్వలాభం కోసం రెవెన్యూ శాఖను రద్దు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరికొంతమంది రెవెన్యూ ఉద్యోగులు పదవులకు ఆశపడి ఇతర ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు మంత్రులను ఎలా కలుస్తారని ప్రశ్నించారు. కావాలనే ఇలా ఆరోపణలు చేస్తున్నారు..మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు. తమకు గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని,  ఉద్యోగం రెగ్యులర్‌ చేస్తే మరింత కష్టపడి చేస్తామని తెలిపారు. 

కొత్త చట్టం వస్తే స్వాగతిస్తాం: గౌతమ్‌(టీజీటీఏ అధ్యక్షులు)

కొత్త చట్టం వస్తే స్వాగతిస్తామని, కొత్త చట్టంలో కూడా మనం పని చెయ్యాలని గౌతమ్‌ వ్యాఖ్యానించారు. రెవెన్యూ శాఖ రద్దు వార్తలను ఖండించాలని కోరారు. ప్రజలకు మనం జవాబుదారీతనంగా పని చేయాలని సూచించారు. కొత్త చట్టంలో మనం కీలక పాత్ర పోషించి ముందుకు వెళదామని కోరారు.

మరిన్ని వార్తలు