కన్నతండ్రి కర్కశత్వం

9 Oct, 2014 03:34 IST|Sakshi

కూతురిని బండకేసి కొట్టి చంపిన వైనం  
 
అమరచింత: తాగిన మైకంలో భార్యను చితకబాదిన ఓ వ్యక్తి తన మూడేళ్ల కూతురిని బండరాయిపై మోది చంపాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా అమరచింత మండలం కొంకనివానిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ నాగ రాజు, లక్ష్మి దంపతులకు మహేశ్వరి(5)ఒక్కగానొక కూతురు. కుటుంబ పోషణను భారంగా నెట్టుకొస్తున్న లక్ష్మితో నాగరాజు నిత్యం మద్యం తాగొచ్చి గొడవపడేవాడు. దీంతో లక్ష్మి నెలరోజుల క్రితం తన కూతురును తీసుకుని పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నాగరాజు పీకలదాకా మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు.

 తల్లిని చూసి అక్కడే రోదిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లాడు. తాగిన మైకంలో అక్కడే ఉన్న బండరాళ్లపైకి చిన్నారి విసిరేశాడు. మెదడు చిట్లి మహేశ్వరి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆగ్రహించిన గ్రామస్తులు నాగరాజును పంచాయతీ కార్యాలయంలో బంధించారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

 

 

మరిన్ని వార్తలు