కోటి కళ్ల చల్లని చూపు

14 Dec, 2018 01:22 IST|Sakshi

కంటి వెలుగు లబ్ధిదారుల్లో కృతజ్ఞత

సాక్షి, హైదరాబాద్‌: గ్రామాల్లో వృద్ధులు దూరం నుంచి ఎవరినైనా చూడాలంటే కను బొమల పైన చెయ్యి పెట్టుకొని, కళ్లు చిన్నవి చేసుకొని చూస్తుండటం సర్వసాధారణం. ఇక మరికొందరి కళ్లు పూర్తిగా కనిపించకపోయినా అలాగే కాలం వెళ్లదీయడమూ మనకు తెలుసు. కళ్లు కనిపిం చడం లేదన్న సంగతి వారికి తెలుసు. కానీ వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవడం, ఆరోగ్యశ్రీలోనూ దానికి ఉచిత వైద్య చికిత్స చేయకపోవడంతో లక్షలాది మంది ఇప్పటివరకు అలాగే కనుచూపు కరువై జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి మారుతోంది. కంటి వెలుగు కింద ప్రభుత్వం కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలు ఇస్తుండటంతో గ్రామీణుల్లో ఆనందం వెల్లివిరిసింది. అప్పటివరకు  తమ మనవడిని, మనుమరాలిని సంపూర్ణంగా చూడలేని పరిస్థితి నుంచి ఇప్పుడు వారిని నిండుగా కళ్లారా చూస్తుండటంతో కంటి 
వెలుగుపై గ్రామీణుల్లో స్పందన పెరిగింది. అదికాస్తా ఎన్నికల్లో ఓటు రూపంలో టీఆర్‌ఎస్‌కు లాభించింది. ‘కేసీఆరే కంటి పరీక్షలు చేయిస్తున్నాడంట. ఆయన చలువ వల్లే కళ్లద్దాలు వచ్చాయి. ఇప్పుడు తృప్తిగా అందరినీ చూస్తున్నామ’న్న ప్రచారం జరిగింది. కేసీఆర్‌ కంటి పరీక్షలంటూ ప్రజలు పిలుచుకుంటున్నారు. ఒకవైపు వృద్ధాప్య పింఛన్, మరోవైపు కంటి చూపుతో వృద్ధులు, పెద్దలు టీఆర్‌ఎస్‌ను నిలువెల్లా దీవించారు. 

90% మంది  బడుగు  బలహీన వర్గాలే..
ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారం భమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్నికల ముందు రోజు వరకు ఏకంగా కోటి మందికి కంటి పరీక్షలు చేశారు. కోటి మందిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలు ఉన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో చాలామంది 18 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. పైగా పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో దాదాపు 90% మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సగానికి పైగా బీసీలే కావడం గమనార్హం. బీసీలు 56.83 లక్షల (56.82%) మంది పరీక్షలు చేయించుకున్నారు. కోటి మందిలో 36.61 లక్షల మందికి ఏదో ఒక కంటి లోపం ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అందులో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా రీడింగ్‌ గ్లాసులు ఇచ్చారు. ఇక వారు కాకుండా చత్వారంతో బాధప డుతున్నవారు 12.95 లక్షల మంది ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారుచేసి ఇవ్వాలని నిర్ణ యించారు. అందులో ఇప్పటికే 1.96 లక్షల మందికి చత్వారం అద్దాలు అందజేశారు. వీరంతా ప్రభు త్వంపై కృతజ్ఞతాభావంతో ఉన్నారు. ‘ప్రభుత్వం గ్రామంలోకి వచ్చి కంటి పరీక్ష చేసి ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వడమనేది సాధారణ విషయం కాదు. గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కళ్లద్దాలు పెట్టుకున్నవారే కనిపిస్తున్నారు. కాబట్టి కంటి వెలుగు కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అది టీఆర్‌ ఎస్‌కు ఓట్ల వర్షం కురిపించింద’ని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 4.47 లక్షల మందికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమం మొదలుపెడతామని వివరించారు. 

►16.6 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసులు ఇచ్చిన వైనం

►12.95 లక్షల మందికి చత్వారం అద్దాలు 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా