గర్వం పనికిరాదు: కేసీఆర్

25 Nov, 2015 19:39 IST|Sakshi
గర్వం పనికిరాదు: కేసీఆర్

గర్వం, అహం పనికి రాదని టీఆర్ ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు. వరంగల్ ఉప ఎన్నికలో విజయం పార్టీ నాయకుల్లో అహాన్ని పెంచకూడదని అన్నారు. వరంగల్ లో విజయం సాధించిన పసునూరి దయాకర్ తో పాటు.. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు బుధవారం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ను కలిశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ గెలుపు గర్వాన్ని తలకెక్కించుకోవద్దని పార్టీనేతలకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు రక్షణ కవచంలా ఉండాలని పిలుపునిచ్చారు.  ప్రజలతో అత్యంత వినయంగా ఉండాలని, శాంతంగా ప్రవర్తించాలని, చాలా సంయమనం పాటించాలని, వీలైనంత తగ్గి ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.

పార్టీకి, ఉద్యమానికి ఎప్పుడు సంక్షోభం వచ్చినా వరంగల్ జిల్లా ప్రజలు అండగా నిలిచారని, ఈసారి ప్రభుత్వాన్ని దీవించి ఆత్మ విశ్వాసం పెంచారన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వరంగల్‌కు తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. జిల్లాలో అతి పెద్ద టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు.

ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, కార్యకర్తలు వాటిని ప్రజలకు చేరేలా చూడాలని అన్నారు. త్వరలోనే కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇస్తామన్నారు. వరంగల్‌లో అత్యధిక మెజారిటీ వచ్చేందుకు కృషి చేసిన వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు