కొత్త సీసాలో.. పాత సారాలా ఉంది: తాటి వెంకటేశ్వర్లు

12 Nov, 2014 03:21 IST|Sakshi
కొత్త సీసాలో.. పాత సారాలా ఉంది: తాటి వెంకటేశ్వర్లు

బడ్జెట్‌లో అంకెలగారడీ తప్ప మరేమీ లేదు. కొత్తసీసాలో పాత సారా మాదిరిగా ఉంది. లక్ష కోట్ల బడ్జెట్ చూపాలనే తపన తప్ప విశ్వసనీయత, స్పష్టత లేదు. ప్రణాళిక వ్యయాన్ని 10 నెలలకే రూ.48,648 కోట్లు చూపారు. ఇది ఉమ్మడిరాష్ట్రంలో కంటే ఎక్కువ. ఇంత పెద్ద బడ్జెట్ అసాధ్యం. గిరిజన విశ్వవిద్యాలయం ఊసే లేదు. తెలంగాణ ఉద్యమంలో  1,200 మంది అమరులు కాగా, 459 కుటుంబాలకే రూ.10 లక్షల చొప్పున పరిహారమిస్తామంటున్నారు.
 
బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగాల ప్రస్తావనే లేదు. ఖమ్మం జిల్లా బయ్యారం స్టీల్‌ప్లాంట్ గురించి పేర్కొనలేదు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో 108, 104 సర్వీసులను ఘనంగా నడిపినా.. వాటి గురించి పేర్కొనలేదు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. దళితులతోపాటు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు. వీటిని గురించిన ప్రస్తావనలేదు. వివిధ మార్గాల్లో ప్రభుత్వ ఆదాయం ఎంత వస్తుంది, ఎందులో ఎంత ఉంది, ఆదాయాన్ని ఎలా పెంచుకుంటారో చెప్పనేలేదు. గోరంతను కొండంత చేసి చూపించారు.
 
సాధారణ స్థాయికి మించి భారీగా భూముల అమ్మకం ద్వారా, కేంద్రం ద్వారా డబ్బు వస్తుందని చెబుతున్నారు. వచ్చే 4 నెలల్లో భూముల అమ్మకం, రిజిస్ట్రేషన్ల ద్వారా అంతస్థాయిలో ఆదాయాన్ని సాధించే పరిస్థితి లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగక కొనుగోళ్లు తగ్గాయి. వైఎస్సార్ హయాంలోనే రియల్ ఎస్టేట్ బూమ్ ఉండగానే రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే.. రూ.4 వేల కోట్లే వచ్చింది. తెలంగాణకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశమే లేదు. ఛత్తీస్‌గఢ్‌నుంచి విద్యుత్ ఎలా వస్తుందనేది తెలియదు. విద్యుత్ సమస్య కారణంగా 400 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే.. ప్రభుత్వానికి హైదరాబాద్‌పై దృష్టి తప్ప గ్రామీణప్రాంతాలపై ధ్యాసే లేదు. విద్యుత్ సమస్యను ఎలా అధిగమిస్తారో చెప్పలేదు. భూమి కొనుగోలుకు వెయ్యి కోట్లు కేటాయించారు. ఒక ఎకరం కూడా భూమిలేనివారు పది లక్షలమంది ఉన్నారు. వారికి భూమి కొనాలంటే 10 లక్షల ఎకరాలకు రూ. 50 వేల కోట్లు కావాలి. వారందరికీ ఇవ్వాలంటే 50 ఏళ్లు పడుతుంది. బడ్జెట్‌లో మొక్కుబడి కేటాయింపులు తప్ప వాస్తవికత లేదు.  లక్ష కోట్లకు పైబడిన బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం నిధుల సేకరణ విషయంలో వాస్తవికత లేదు. ఖమ్మం జిల్లాలోని 7 పోలవరం ముంపు మండలాలకు (ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినవి) ఉదారంగా కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నారు. వారంతా తెలంగాణవాళ్లే.  నా సొంత గ్రామం కూడా అక్కడే ఉంది. అక్కడి వారు తెలంగాణకే, తనకే ఓటువేశారు. ఆ మండలాల్లోని ఉద్యోగులు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారినీ తెలంగాణకు తీసుకురావాలి.’
 
 మంత్రి హరీశ్‌రావు స్పందన..
 ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు కలుగజేసుకుని 7 మండలాలు తెలంగాణలోనే ఉండాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో లేఖ రాయించాలని అన్నారు. ఈ అంశంపై మీ పార్టీ విధానం ఏమిటో చెప్పాలన్నారు. జగన్, చంద్రబాబు, అందరూ కలిసి ఈ మండలాలను అక్కడ కలిపారని, ఎందుకు కలపమన్నారో జగన్‌ను అడగాలని ప్రశ్నిం చగా.. ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్పందిస్తూ సభలో లేని వ్యక్తి గురించిమాట్లాడడడం సరికాదన్నారు. అంతకు ముందు వైఎస్సార్ పాలన ప్రస్తావన తెచ్చి తాటి మాట్లాడుతున్నపుడు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కలుగజేసుకుని వైఎస్సార్ పేరు ఎత్తే నైతికహక్కు లేదంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు