నిజమే చెప్పండి

14 Aug, 2014 02:39 IST|Sakshi
నిజమే చెప్పండి

కచ్చితత్వం కోసమే కుటుంబసర్వే
అపోహలు, అనుమానాలు వద్దు
పథకాల అమలుకు సర్వే ప్రాతిపదిక కాదు
స్థానికత’కోసం కాదు
19న కుటుంబసభ్యుల హాజరు తప్పనిసరి
గల్ఫ్ వెళ్లిన వారి వివరాలు నమోదు చేయం
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రజల సామాజిక స్థితిగతులు తెలుసుకునేందుకోసమే 19న కుటుంబసర్వే నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. సర్వేపై ప్రజల్లో అనేక అపోహలు... సందేహాలు నెలకొన గా వాటిని నివృత్తి చేసేందుకు కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి సమగ్రంగా వివరించారు. రాష్ట్ర సమగ్ర సమాచారంతో ప్రభుత్వానికి అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడం, పథకాల రూపకల్పన లబ్ధిదారుల ఎంపిక సులభతరమవుతుందని తెలిపారు. ఈ సర్వేలో స్థానికతను నిర్ధారించడం లేదన్నారు. ప్రతి పౌరుడి సమాచారం సేకరిస్తామని చెప్పారు. సూక్ష్మంగా నిర్వహించే ఈ సర్వేతో ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వ రికార్డుల్లోకి చేరుతుందని, తద్వారా సంక్షేమ ఫలాలు దుర్వినియోగం కాకుండా దోహదపడతుందనిస్పష్టం చేశారు.
 
కొందరికి మినహాయింపు
ఇంటింటి సర్వేకు కుటుంబసభ్యుల హాజరు తప్పనిసరి అని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలు, హాస్టల్‌లో ఉండే పిల్లలు, అత్యవసర వైద్య సేవలు తీసుకునేవారు, సర్వే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేయబోమని స్పష్టం చేశారు. ఉపాధి నిమిత్తం గ్రామీణ ప్రాంతాలనుంచి పట్టణాల్లోకి వచ్చి స్థిరపడిన వారు ఒకేచోట వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే పట్టణాల్లో లేదంటే సొంత గ్రామానికి వెళ్లి నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
 
సర్టిఫికెట్లలో ఏదో  ఒకటి చూపాలి
సర్వేకు వచ్చే ఎన్యుమరేటర్‌కు కుటుంబసభ్యులు ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. వికలాంగులు సదెరమ్ సర్టిఫికెట్లు ఉంటే చూపించాలని సూచించారు. రేషన్‌కార్డు, బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతా, కరెంటుబిల్లు, ఆధార్‌కార్డును ధ్రువీకరణగా చూపాలని చెప్పారు. కుటుంబాల విభజనకు మాత్రమే వంట గదులను ప్రామాణికంగా తీసుకుని వివరాలు నమోదు చేస్తామని వెల్లడించారు. తప్పుడు సమాచారమిస్తే భవిష్యత్తులో ఇబ్బందులెదురవుతాయని తెలిపారు. ఉదాహరణకు భూములు, వాహనాలు ఉన్నప్పటికీ లేవనే సమాధానం చెబితే భవిష్యత్తులో వాటిని విక్రయించుకోరాదని, రిజిస్ట్రేషన్‌లో ఆ వివరాలు తేలిపోతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
 
పక్కా ఏర్పాట్లు
జిల్లాలో కుటుంబాల సమాచారం నమోదులో కచ్చితత్వమే లక్ష్యంగా ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 9.76 లక్షల కుటుంబాలున్నాయని, వాటన్నింటికీ నోషనల్ నంబర్లు ఇస్తున్నామని తెలిపారు. నంబర్ల ప్రకారం 10.20 లక్షల కుటుంబాలు కావచ్చని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ లెక్కన సర్వేకు 35 నుంచి 36 వేల మంది ఎన్యుమరేటర్లు అవసరముందని అంచనా వేశామన్నారు. సర్వే ఉదయం 8 గంటలకు ప్రారంభమై 10 గంటలపాటు సాగుతుందని, సర్వే రోజు సాయంత్రమే ఫ్రీజ్ చేస్తామని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు