ప్రసవ వేదన..!

9 Oct, 2016 03:51 IST|Sakshi
ప్రసవ వేదన..!

- గర్భిణి ప్రాణాలతో చెలగాటమాడిన వైద్యులు
- మత్తు డాక్టర్ లేరంటూ అర్ధరాత్రి వేళ ఆస్పత్రి నుంచి పంపిన వైనం
-‘గాంధీ’లోనూ అదే నిర్లక్ష్యం...
- అంబులెన్స్‌లోనే నార్మల్ డెలివరీ
- తల్లీబిడ్డా క్షేమం
 
 మెదక్ మున్సిపాలిటీ: ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.  మత్తు డాక్టర్ లేరని అర్ధరాత్రి వేళ ఆస్పత్రి నుంచి పంపించేశారు.  ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో అంబులెన్స్‌లోనే ప్రస వించింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మం డలం ఆత్మకూర్‌కు చెందిన లావణ్య, సంగయ్య దంపతులు. లావణ్య ప్రసవం కోసం ఈ నెల 6న మెదక్ ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్‌కు మత్తు డాక్టర్ అందుబాటులో లేరని, గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని శుక్రవారంరాత్రి 10 గంటల సమయంలో వైద్యులు సూచించారు. దీంతో మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించగా పలు పరీ క్షలు చేశారు. అక్కడా ఆపరేషన్ కు మత్తు డాక్టర్ అందుబాటులో లేరని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితిలో గాంధీ ఆస్పత్రికి లావణ్య వెళ్లింది.  డెలివరీ కష్టమని వైద్యులు చెప్పారు.  భయాందోళనకు గురైన సంగయ్య భార్యను ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్ ్సలోనే  మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

 మత్తు డాక్టర్ సెలవులో ఉన్నారు
 మెదక్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా మత్తు వైద్యురాలు  సెలవులో ఉన్నారని తెలిపారు. లావణ్యను తామే గాంధీ ఆస్పత్రికి పంపించామని చెప్పారు.

 నరకయాతన అనుభవించాం..
 నిరుపేదలమైన మేము మెదక్ ఏరియా ఆస్పత్రికి వస్తే అర్ధరాత్రివేళ గాంధీ ఆస్పత్రికి పొమ్మన్నారు. ఆ అర్ధరాత్రి ఎంతో నరకం చూశాం. గర్భిణి అరుున నా భార్యను ఏ ఆస్పత్రిలోనూ వైద్యులు సరిగా పట్టించుకోలేదు. దేవుడి దయతో నా భార్యాబిడ్డా ప్రాణాలతో బయటపడ్డారు.   - సంగయ్య, ఆత్మకూర్, నాగిరెడ్డిపేట మండలం

మరిన్ని వార్తలు