బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు

19 Mar, 2016 02:21 IST|Sakshi

భూత్పూర్ / మద్దూరు/ ఆమనగల్లు : జిల్లాలో వేర్వేరుచోట్ల నాలుగు బాల్య వివాహాలను పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. భూత్పూర్ మండలంలోని వెల్కిచర్లలో పదోతరగతి చదువుతున్న 16ఏళ్ల బాలికను బిజినేపల్లి మండలం వెల్గొండ వాసి రాజు తో ఈనెల 19న వివాహం చేసేందుకు కుటుంబ పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలోనే శుక్రవారం వధువుకు ప్రథానం చేసేందుకు పూనుకోగా కొందరు గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఎస్‌ఐ అశోక్, తహ సీల్దార్ జ్యోతి, ఐసీడీఎస్ సీడీపీఓ ప్రవీణ అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు.

బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరమని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చా రు. అనంతరం బాలికను ఐసీడీఎస్ సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. మరో సంఘటనలో మద్దూరు మండలంలోని పల్లెర్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలకు వారి తల్లిదండ్రులు త్వరలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న బాధితులు శుక్రవారం భూమిక స్వచ్ఛంద సంస్థ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నం.18004252908కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. దీంతో సంస్థ సభ్యురాలు వసంత, ఎస్‌ఐ నరేందర్ గ్రామానికి చేరుకుని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాలికలిద్దరినీ పెదిరిపాడ్‌లోని కేజీబీవీకి తరలిం చారు. వారిని జిల్లా కేంద్రంలోని బాలసదన్‌లో చదవిస్తామని భూమిక సంస్థ సభ్యురాలు తెలిపారు.

ఇంకో సంఘటనలో ఆమనగల్లు మండలం ఎక్వాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరానగర్‌తండాలో 16ఏళ్ల బాలికకు త్వరలో ముద్విన్ గ్రామపంచాయతీ పరిధిలోని కొరచకొండతండాకు చెందిన వీరానాయక్‌తో వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. విషయాన్ని స్థానికులు కొందరు పోలీసులకు సమాచారమివ్వడంతో శుక్రవారం ఉదయం ఎస్‌ఐ సాయికుమార్, ఎంఆర్‌ఐ హరీందర్‌రెడ్డి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు దానమ్మ, దమయంతి అక్కడికి చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని చెప్పి వారి నుంచి ఒప్పంద పత్రం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు