సగటు మహిళే నా నాయిక

5 Apr, 2015 00:09 IST|Sakshi
  • ‘కల్పనా సాహిత్యం- రచయిత్రుల కృషి’ సదస్సులో ప్రముఖ రచయిత్రి యద్దనపూడి
  •  సాక్షి, హైదరాబాద్: నాకు ఏ పుస్తకాలూ, కవులూ ప్రేరణ కాదు. సగటు మహిళ త్యాగం, శ్రమ, ఆమె జీవితమే నా రచనలకు ప్రేరణ. నా కథలు, నవలల్లో నాయిక ఆమే’’ అని సుప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తెలిపారు. ‘సెక్రటరీ’, ‘మీనా’, ‘జీవన తరంగాలు’ లాంటి ప్రసిద్ధ నవలల ద్వారా కొన్ని తరాలను ఉర్రూతలూపిన యద్దనపూడి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సాహితీ ప్రియుల ముందుకు వచ్చి తన మనసులోని మాటలను పంచుకున్నారు.

    శనివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో ‘కల్పనా సాహిత్యం - రచయిత్రుల కృషి’ అనే అంశంపై వర్సిటీలోని మహిళా అధ్యయన కేంద్రం, రచయిత్రులే సభ్యులుగా నడుస్తున్న మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ ‘లేఖిని’ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో యద్దనపూడి ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘అప్పట్లో కొంతమంది వంటింటి సాహిత్యం అంటూ స్త్రీల రచనల్ని చిన్నచూపు చూసేవారు.

    ఆ మాటలకు భిన్నంగా పాఠకులు ఈ రచనలను బాగా ఆదరించారు. అది నాపట్ల, నా రచనలపట్ల ప్రేమానుబంధంగా పరిణమించింది. నేను ఉమ్మడి కుటుంబంలో పుట్టాను. కథలు రాయడం మొదలుపెట్టాక ఆ ఇల్లే నాకు విస్తృత సమాజంగా అనిపించేది. నేను చదివింది పదే అయినా చూసిన విషయాలు, నా చుట్టూ ఉన్న మనుషుల జీవితాలతోనే మమేకమయ్యాను. అవే నేను రాశాను. నా కలానికి సగటు గృహిణే పెద్ద బలం. నేను, నా పాఠకులు, నా ప్రచురణకర్తలు.. ఇదొక త్రివేణీ సంగమం’’ అని యద్దనపూడి తన రచనా జీవితాన్ని ఆవిష్కరించారు.
     
    స్త్రీల రచనలే సమాజానికి మేలు చేశాయి

    తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటూ ‘‘ఈనాడు కవిత్వంకన్నా ఎక్కువ మేలు చేస్తున్నది కథలే. స్త్రీల రచనలు ‘వంటింటి కథలు’ కాదు. అవి ఇంటింటి కథలు’’ అని వ్యాఖ్యానించారు. రచయిత్రుల రచనలు ప్రారంభమై వందేళ్లు గడచినా వాటిపై తగినంత చర్చ జరగడం లేదనీ, అందుకే నిరుడు తెలంగాణ రచయిత్రుల సదస్సు చేసినట్లే, ఈసారి ఈ ప్రయత్నం చేస్తున్నామని మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు, రచయిత్రి సి.మృణాళిని తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు.

    సాహితీవేత్త ఆచార్య సుమతీ నరేంద్ర కీలకోపన్యాసం చేస్తూ పత్రికల్లో వచ్చే యద్దనపూడి తదితరుల రచనలను ముందుగా చదవడం కోసం ఆ రోజుల్లో పాఠకుల్లో నెలకొన్న పోటీ వాతావరణాన్ని గుర్తుచేశారు. స్త్రీల రచనలపై వచ్చిన విమర్శల్ని తిప్పి కొడుతూ, ‘‘స్త్రీల రచనలు అమ్మల మనోభావాలనూ, ఉద్యోగినుల సమస్యలనూ, బాల వితంతువుల సమస్యలనూ, ఇష్టంలేని భర్తతో కాపురం చేస్తున్న స్త్రీల వేదనలనూ ప్రతిబింబించాయి. సెక్స్, క్రైమ్, మూఢనమ్మకాలే ప్రధానాంశాలుగా రాసిన నవలలకన్నా ఇవే మెరుగైనవి, సమాజానికి మేలు చేసినవి’’ అని సుమతీ నరేంద్ర విశ్లేషించారు.

    విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త ముదిగంటి సుజాతారెడ్డి మాట్లాడుతూ, స్త్రీల సాహిత్య ఆవిర్భావం నుంచి 1960ల దాకా సాగిన కృషిని సమీక్షించారు. ‘లేఖిని’ అధ్యక్షురాలు, రచయిత్రి వాసా ప్రభావతి మాట్లాడుతూ ‘‘తెలుగు సమాజాన్ని ఉన్నత స్థాయికి తెచ్చింది రచయిత్రులే’’ అన్నారు. ఈ సదస్సు ద్వారా 1960ల మొదలు ఇప్పటివరకు వచ్చిన స్త్రీల సాహిత్యంపై సింహావలోకనం జరుపుతున్నట్లు తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన కథా రచయిత ఏఎన్ జగన్నాథ శర్మ మాట్లాడుతూ తన రచనా నేపథ్యానికి బీజం వేసింది మహిళలు, మహిళల సాహిత్యమేనన్నారు.
     
    రచయిత్రుల సందడి

    ప్రముఖ రచయిత్రులు డి.కామేశ్వరి, పొత్తూరి విజయలక్ష్మి, డి.శారదా అశోకవర్ధన్, ముక్తేవి భారతి, శాంతకుమారి, కె.బి. లక్ష్మి, సోమరాజు సుశీల తదితరులతోపాటు రచయితలు శ్రీపతి, వేదగిరి రాంబాబు, సుధామ, సుద్దాల అశోక్‌తేజ హాజరవడంతో సభా ప్రాంగణం సాహితీ పరిమళాలు వెదజల్లింది. రామలక్ష్మీ ఆరుద్ర, రంగనాయకమ్మ, అబ్బూరి ఛాయాదేవి, నాయని కృష్ణకుమారి, ఆనందారామం తదితర 15 మంది ప్రముఖ రచయిత్రుల రచనలను విశ్లేషిస్తూ మరో 15 మంది రచయిత్రులు పత్రాలను సమర్పించడం ఈ సదస్సును సాధారణ సమావేశాలకన్నా భిన్నంగా నిలిపింది.  

మరిన్ని వార్తలు