ఈ పాప మాకొద్దు

10 Aug, 2014 03:45 IST|Sakshi

      మూడోసారి కూతురు పుట్టిందని ముఖం చాటేసిన తల్లిదండ్రులు
     శుక్రవారం జన్మించిన మహాలక్ష్మిని తీసుకెళ్లాలని కౌన్సెలింగ్ నిర్వహించిన ఐసీడీఎస్ అధికారులు
     వద్దని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించిన కన్నవారు
 
నెల్లికుదురు :  నవమాసాలు మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి పుట్టింది కూతురని తె లియగానే ముఖం చాటేసింది. తల్లి పాల రుచి ఏమిటో తెలియకముందే..  ఆ పసికందు తల్లి లాలనకు దూరమైంది. పుట్టి రోజు గడవక  ముందే ఆ తల్లిదండ్రులకు బిడ్డ భారమైంది. మూడో కాన్పులోనూ కూతురే జన్మించడంతో తాము పోషించలేమని కన్నవారు పసికందును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించిన సంఘటన మండల కేంద్రంలో శనివారం జరిగింది.
 
మండలంలోని జామ తండాకు చెందిన గుగులోత్ మాన్‌సింగ్, బుజ్జి దంపతులకు ఇదివరకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మళ్లీ గర్భం దాల్చిన బుజ్జి పురుటి నొప్పులతో మండల కేంద్రంలోని ప్రజా ఆరోగ్య కేంద్రంలో చేరింది. ఈనెల 8న(శుక్రవారం) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తనకు మూడో కాన్పులోనైనా కుమారుడు పుడతాడనకుంటే మళ్లీ కూతురే పుట్టిందని.. ఈ బిడ్డ తమకు వద్దంటూ ఆ తల్లిదండ్రులు దగ్గరికి తీసుకోవడానికి మొండికే శారు.
 
దీంతో ఆస్పత్రిలోని ఏఎన్‌ఎం రమ ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రత్నకూమారి, జామతండా అంగన్‌వాడీ టీచర్ బి.సుజాత ఆస్పత్రికి చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం మంచి రోజని, మహాలక్ష్మి పుట్టిందని వారు నచ్చజెప్పినా ఆ తల్లిదండ్రులు వినలేదు. ఐసీడీఎస్ సీడీపీఓ నిర్మల ఆదేశాల మేరకు ఇంకా సరిగా కళ్లు తెరవని ఆ పసికందును వరంగల్‌లోని శిశువిహార్‌కు తరలించారు.
 
 ముగ్గురు బిడ్డలను పెంచే స్థోమత మాకు లేదు
 మాకు ఇప్పటికే ఇద్దరు బిడ్డలు ఉన్నరు. కొడుకు పుడుతాడని చూసినం. కాని మల్ల బిడ్డే పుట్టింది. మాకుంది ఒక ఎకరం భూమే. ముగ్గురు కూతుర్లను పెంచే స్థోమత లేకనే మూడో బిడ్డను వద్దనుకుని అంగన్‌వాడీ వాళ్లకు మనసు సంపుకొని అప్పజెప్పినం.
 - మూన్‌సింగ్, బుజ్జి


 మాకు ఇప్పటికే ఇద్దరు బిడ్డలు ఉన్నరు. కొడుకు పుడుతాడని చూసినం. కాని మల్ల బిడ్డే పుట్టింది. మాకుంది ఒక ఎకరం భూమే. ముగ్గురు కూతుర్లను పెంచే స్థోమత లేకనే మూడో బిడ్డను వద్దనుకుని అంగన్‌వాడీ వాళ్లకు మనసు సంపుకొని అప్పజెప్పినం.
 - మూన్‌సింగ్, బుజ్జి
 

మరిన్ని వార్తలు