-

గాజులద్దిన తెలం‘ఘన కీర్తి’

24 May, 2015 01:04 IST|Sakshi

రెండు వేల ఏళ్ల క్రితమే సొబగులద్దిన తెలంగాణ ‘గాజు’
భువనగిరి సమీపంలో వర్ధిల్లిన పరిశ్రమ

హైదరాబాద్: అలంకరణలో గాజుదే కీలక ‘పాత్ర’. తల, మెడ, ముంజేతులు, మణికట్టు.. ఆభరణం ఏదైనా గాజు పొదిగితే దాని అందమే వేరు. ఆభరణాలే కాదు అలంకరణ వస్తువుల శోభను పెంచడంలోనూ గాజు పాత్ర కీలకం. అంతటి ప్రాధాన్యం ఉన్న గాజును రెండు వేల ఏళ్ల క్రితమే నాణ్యంగా, నైపుణ్యంగా ప్రపంచానికి అందించిన ఘన చరిత్ర మన తెలంగాణది. చారిత్రక భువనగిరి ఖిల్లాకు చేరువలో ఇలాంటి అద్భుత పరిశ్రమ అప్పట్లో అలరారింది.

ఆ ప్రాంతంలో వేల కుటుంబాలు ఆ పరిశ్రమను ఆసరా చేసుకుని జీవనం సాగించాయి. ఆ ప్రాంతం ‘గాజు’ పేరుతోనే వర్ధిల్లింది. భువనగిరి సమీపంలో ఉన్న బస్వాపూర్ గ్రామమే నాటి గాజు పరిశ్రమ కేంద్రం. ఇప్పటికీ ఆ ఊరిని గాజుల బస్వాపూర్‌గానే పిలుస్తున్నారు. ప్రస్తుతం పేరులో మాత్రమే కనిపించే ‘గాజు’ జాడలు తాజాగా వెలుగుచూశాయి. ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం సభ్యులు రామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి రెండు శతాబ్దాల కాలం నాటి గాజు పరిశ్రమ గలగలల నిగ్గుతేల్చారు.
     -సాక్షి, హైదరాబాద్



ముడి సరుకుకు కొదవ లేకపోవడమే...
బస్వాపూర్ గ్రామ శివారులోని గాండ్రోని చెలకలో గాజుల బట్టీల ఆనవాళ్లు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. బట్టీలు మట్టి దిబ్బల్లో మూసుకుపోయినప్పటికీ.. నాటి బట్టీలకు వినియోగించిన ముడిసరుకు, అందులో నుంచి వెలికితీసిన గాజు ముద్దలు, గాజు తయారీకి వినియోగించిన పాత్రల అవశేషాలు, సున్నపురాళ్లు, డంగు సున్నం ముద్దలు అక్కడ విస్తారంగా కనిపిస్తున్నాయి. ఈ మిశ్రమాలను నూరేందుకు వినియోగించిన నల్ల సానరాళ్లు కూడా ఉన్నాయి. స్థానికంగా ఉన్న ఉసిళ్లవాగు నుంచి స్వచ్ఛమైన నీటిని గాజు తయారీకి వినియోగించారని తెలుస్తోంది. వాగు నుంచి మంచి ఇసుక (సిలికాన్ డై ఆక్సైడ్) వాడేవారు. సమీపంలోని పాండవుల గుట్ట రాళ్లు కూడా నాణ్యమైన ముడి రాతి రేణువులను అందించేది.

గాజుకు వివిధ రంగులు అందించేందుకు ఫెర్రిక్ ఆక్సైడ్ ఉన్న ఖనిజపు రాళ్లు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు భువనగిరి మీదుగా ప్రాచీన రహదారి ఉండేది. ఇలా అన్ని రకాలుగా ఈ ప్రాంతం అనువైందిగా ఉండడంతో దీన్ని గాజుల పరిశ్రమకు కేంద్రంగా మార్చుకున్నారు. ఇప్పటికీ అక్కడి పొలాలను దున్నుతున్నప్పుడు గాజుకు సంబంధించిన వస్తువులు బయటపడుతూనే ఉన్నాయి. గ్రామంలో క్రీ.శ.6- 7 శతాబ్దాల క్రితం నాటి శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, రాష్ట్ర కూటుల కాలం నాటి వినాయకుడి విగ్రహం దొరకడం గ్రామ చరిత్రను స్పష్టం చేస్తోంది.
 
గాండ్రోని చెలక పేరు ఇలా...
ప్రస్తుతం గాజు పరిశ్రమ ఆనవాళ్లు దొరుకుతున్న ప్రాంతాన్ని గాండ్రోని చెలకగా పిలుస్తున్నారు. కాచరోని.. గాచ్రోని.. గాండ్రోని... ఇలా ఆ పేరు రూపాంతరం చెందినట్టు తెలుస్తోంది. కాచము అంటే గాజు. దానివల్లే ఆ చెలకకు ఆ పేరు వచ్చిందంటారు. దీంతోపాటు ఎర్ర చెలకలు, పలుగురాళ్ల కేంద్రం సైదాపురం గుట్టలు, మంచి ఇసుకను ఇచ్చే మాసాయిపేట పూసలగుట్టలు  కూడా ఈ పరిశ్రమతో  విరాజిల్లినట్టు   తెలుస్తోంది.

మరిన్ని వార్తలు