మో‘డల్’ పాఠశాలలు లేనట్టే

11 Jun, 2014 04:13 IST|Sakshi
మో‘డల్’ పాఠశాలలు లేనట్టే

గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకూ కార్పొరేట్ తరహా విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన మోడల్ పాఠశాలలు బాలారిష్టాలను దాటడం లేదు. పాఠశాలల్లో సవాలక్ష సమస్యలు తిష్టవేసుకొని ఉన్నాయి. కొన్ని చోట్ల భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. తరగతులు ప్రారంభమైన చోటా పూర్తిస్థాయిలో వసతులు లేవు. భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడంతో 21 మండలాల పేద విద్యార్థులకు మోడల్ స్కూళ్లలో చదివే అవకాశం లేకుండా పోయింది. అందిస్తున్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తుండడంతో మోడల్ పాఠశాలల్లో అడ్మిషన్‌లకు డిమాండ్ బాగానే ఉంది.
 
ఇప్పటివరకు నిజాంసాగర్, మద్నూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, సదాశివనగర్, సిరికొండ, ధర్పల్లి, నందిపేట్, నవీపేట్, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, వర్ని, డిచ్‌పల్లి, రెంజల్ మండలాల్లోనే మోడల్ పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించారు. ఆయా పాఠశాలల్లోనే తరగతులు ప్రారంభించారు. దీంతో బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, వేల్పూర్, భీమ్‌గల్, లింగంపేట్, గాంధారి, మాచారెడ్డి, బోధన్, ఎడపల్లి, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, బీర్కూర్, కోటగిరి, తాడ్వాయి, కామారెడ్డి, నిజామాబాద్, మాక్లూర్, దోమకొండ, భిక్కనూరు మండలాల్లోని విద్యార్థులు మోడల్ విద్యకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
 
మోడల్ పాఠశాలలకు సొంత భవనం నిర్మించే వరకు అద్దె భవనాల్లో తరగతులను నిర్వహించాలని మొదట అధికారులు భావించారు. అయితే అనువైన అద్దె భవనాలు దొరకవనే ఉద్దేశంతో సొంత భవనాలు నిర్మించే వరకు పాఠశాలలను ప్రారంభించేది లేదని అధికారులు నిర్ణయించారు. కొన్ని మండలాల్లో పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడం, మరి కొన్ని మండలాల్లో భూ సేకరణ దశలోనే ఉండటంతో విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చింది.
 
సమస్యలెన్నో..
మోడల్ పాఠశాలల్లో పలు సమస్యలున్నాయి. చాలా పాఠశాలల్లో సరిపోయేంత ఫర్నిచర్ లేదు. ల్యాబ్ సౌకర్యాలు లేవు. ఉపాధ్యాయుల కొరత ఉంది. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతో కొన్ని ఆదర్శ పాఠశాలల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులను నియమించారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి డిప్యుటేషన్‌పై కొందరిని పంపించారు.

ఇంటర్ పాఠ్యాంశాలు బోధించడానికి పూర్థిస్థాయిలో లెక్చరర్స్‌ను నియమించకపోవడంతో సిలబస్ పూర్తి కాకుండానే విద్యార్థులు పరీక్షలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఏడు, తొమ్మిది, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతున్నాయి. అయితే ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయపోవడంతో ఈసారీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం కష్టమే.

మరిన్ని వార్తలు