వినాయక వ్యాపారం@ రూ.2.50 కోట్లు

29 Aug, 2014 13:43 IST|Sakshi
వినాయక వ్యాపారం@ రూ.2.50 కోట్లు

మంచిర్యాల సిటీ : గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలో వినాయక ప్రతిమల వ్యాపారం రూ.2.50 కోట్లు జరుగుతుందని వ్యాపార వర్గాల అంచనా. జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో వినాయక ప్రతిమల కొనుగోలు మొదలుకుని నిమజ్జనం వరకు గణేష్ ఉత్సవ కమిటీ ఖర్చుకు వెనుకాడడం లేదు. జిల్లాలో ప్రతిమల ధర రూ.500 నుంచి రూ.15వేల వరకు ఉంది.

మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, లక్సెట్టిపేట, జన్నారం, దండేపల్లి, ఖానాపూర్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, ఆదిలాబాద్ ప్రాంతాలతోపాటు పరిసర ప్రాంతాల్లో సుమారు నాలుగు వేల ప్రతిమలను భక్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సగటున ఒక్కో ప్రతిమ ధర రూ. 5వేలు ఉంటే వీటి అమ్మకం ద్వారా రూ.2 కోట్ల వ్యాపారం జరుగుతుంది.

ఉత్సవాల కోసం పూజ సామగ్రి కూడా విక్రయిస్తుంటారు. పండ్లు, పూలు, ఇతరత్రా పూజా సామగ్రి వ్యాపారం తొమ్మిది రోజులకు రూ.10లక్షల వరకు అవుతుంది. నవరాత్రుల్లో ఏదో ఒక రోజు ప్రతీ గణేష్ మండపం వద్ద ఉత్సవ కమిటీలు అన్నదానం నిర్వహిస్తుంటాయి. జిల్లా వ్యాప్తంగా పిండి వంటలు, భోజన పదార్థాలకు సుమారు రూ.40 లక్షలు ఖర్చు చేయనున్నారు. 

మరిన్ని వార్తలు