అమ్మ.. నేను చనిపోతున్నా

5 Nov, 2014 00:55 IST|Sakshi

ఈ సంఘటన మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మేకల పద్మ, మల్లేశం దంపతులకు మమత(19), స్వప్న, వేణు ముగ్గురు సంతానం. 9 ఏళ్ల క్రితమే తండ్రి మరణించడంతో కూలినాలి చేసుకుంటూ పద్మ తన పిల్లలను పోషించుకుంటోంది. పెద్ద కూతురు మమతను పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ వరకు చదివించింది.

 అనంతరం గత మే 13న జోగిపేటకు చెందిన అల్మాయిపేట కిషన్, ఇందిర దంపతుల కొడుకు యాదగిరికి ఇచ్చి పెళ్లి జరిపించింది. కట్నకానుకల కింద రూ.4 లక్షల విలువ గల బంగారం, ఇంటి సామగ్రి ఇచ్చి ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేసింది. పెళ్లై ఆరుమాసాలు కావస్తున్న ఏనాడు తనతో కలిసి లేడని బాధితురాలు మమత తన తల్లికి రాసిన ఉత్తరంలో పేర్కొంది.

తన పెళ్లికి వరకట్నంగా ఇచ్చిన రూ.4 లక్షలను తిరిగి తల్లికి ఇప్పించాల్సిందిగా పోలీసులను కోరుతూ ఉత్తరంలో పేర్కొంది. నేను బతికుండి అమ్మకు ఇబ్బంది పెట్టడం కన్నా చావే మార్గమని ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసింది. నా చావుకు భర్త, అత్తతో పాటు మా చిన్నత్త కూడా కారణమంటూ రాసిన ఉత్తరాన్ని బీరువాలో దాచిపెట్టి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు మంటలార్పి హుటాహుటిన ఆమెను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బీరువాలో దాచిన ఉత్తరం గురించి వైద్యులు, కుటుంబీకులకు తెలిపింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు మమతను గాంధీకి తరలించారు. ఆమె ఒంటిపై 85 శాతం మేర కాలిన గాయాలున్నాయని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు