కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి

2 Sep, 2015 03:04 IST|Sakshi
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి

రైతు ఆత్మహత్యలపై ఏఐసీసీ కార్యదర్శి కుంతియా
 
 వరంగల్ : రైతుల ఆత్మహత్యలు దేశంలో సర్వసాధారణంగా మారాయని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఆర్‌సీ.కుంతియా అన్నారు. వరంగల్ జిల్లా కాం గ్రెస్ కమిటీ, తెలంగాణ కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్‌ల సంయుక్త ఆధ్వర్యం లో వరంగల్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు పిట్టల్లా రాలిపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. భూసేకరణ బిల్లును రైతులు వ్యతిరేకించడంతో మార్పులు చోటు చేసుకోనున్నాయని పేర్కొ న్నారు. వ్యవసాయరంగంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల తర్వాత స్థానం తెలుగు రాష్ట్రాలదే అన్నారు.

వ్యవసాయ రంగాన్ని పట్టించుకోక పోవడంతో 2000 సంవత్సరం నుంచి పంటలు తక్కువ సాగు అవుతున్నాయన్నారు. అమెరికా లాంటి దేశాలు రైతులకు 300 శాతం సబ్సిడీని అందిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలని కుంతియా సూచించారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, ఎంపీలు ఏకే .ఖాన్, హన్మంతరావు, ఆనందభాస్కర్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌రాబు, సారయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు