నగర కేంద్ర గ్రంథాలయంలో ‘రూ.5 భోజనం’

18 Oct, 2014 04:41 IST|Sakshi
నగర కేంద్ర గ్రంథాలయంలో ‘రూ.5 భోజనం’

వివేక్‌నగర్: నగర కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ఎమ్మెల్యే డా.కె.లక్ష్మణ్‌తో కలసి రూ.5కు భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ హరేకృష్ణ మూవ్‌మెంట్ వారి సహకారంతో జీహెచ్‌ఎంసీ రూ.5కే భోజనాన్ని నగరంలో 15సెంటర్లలో అందిస్తోందన్నారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోంచి గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటారని, వారిలో చాలామంది పేదవారు ఉన్నారని అన్నారు.

ఇక్కడ రూ.5కే భోజనం ఏర్పాటు చేయడంతో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే డా.లక్ష్మణ్, స్థానిక కార్పొరేటర్, ఇతర జీహెచ్‌ఎంసీ అధికారులు భోజన ఏర్పాట్లలో కృషిచేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం 500 మంది విద్యార్థులకు భోజనం అందజేస్తున్నామని, అవసరమైతే వెయ్యి మందికి సరఫరా చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే డా.కే.లక్ష్మణ్ మాట్లాడుతూ బీదవారికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు.
 
జీహెచ్‌ఎంసీ సెస్ నిధులు విడుదల చేయాలి: గ్రంథాలయ చైర్మన్

కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ నుంచి ఆరేళ్లుగా రావాల్సిన లైబ్రరీ సెస్సు దాదాపు రూ.80 కోట్లు ఉందని, దీంతో గ్రంథాలయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నగరంలోని 86 శాఖా గ్రంథాలయాల్లో  విద్యుత్ బిల్లులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు చెల్లించలేని దుస్థితి ఉందన్నారు. సెస్సు విడుదల చేయాలని కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ పీఆర్‌ఓ రవిలోచన స్వామి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ డా.సత్యనారాయణ, డీఎంసీ యాదగిరిరావు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
 

మరిన్ని వార్తలు