మార్పు తప్పదు!

7 Feb, 2016 20:28 IST|Sakshi
మార్పు తప్పదు!

బీటీపీఎస్ నిర్మాణంపై నీలినీడలుముందుచూపు లేని టీఎస్ జెన్‌కోకేంద్రం సీరియస్ కావడంతోపునరాలోచన పనులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్ల గగ్గోలు

 మణుగూరు: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్) నిర్మాణంపై అస్పష్టత నెలకొంది. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దులోని సాంబాయిగూడెం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట, సీతారాంపురం గ్రామాల వద్ద నిర్మించే ప్లాంటు, ఉత్పత్తికి సంబంధించి కాలంచెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడడమే కాక కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు ల శాఖ నుంచి ఎలాంటి పర్యావరణ అనుమతులు రాకుండానే హడావుడిగా బీహెచ్‌ఈఎల్ ద్వారా టీఎస్ జెన్‌కో నిర్మాణ పనులు మొదలుపెట్టి.. శరవేగంగా చేయిస్తుండడంతో పరిస్థితి మొదటికొచ్చింది. అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే గత ఏడాది సెప్టెంబర్ నుంచే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. ఒక్కొక్కటి 270 యూనిట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్ల ద్వారా 1,080 మొగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో సుమారు 1100 ఎకరాల్లో ప్లాంట్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి భూనిర్వాసిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో ప్యాకేజీలు చెల్లించకపోవడంతోపాటు ఉద్యోగాలు కోరుకున్న 371 మంది యువతకుఇప్పటికీ ఉద్యోగ హామీ పత్రాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు మాత్రం శరవేగంగా జరిగాయి. 2016 డిసెంబర్ కల్లా మొదటి యూనిట్ నుంచి 270 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో యూనిట్ పనులతోపాటు స్విచ్‌యార్డ్, బాయిలర్, చిమ్నీ పనులు సైతం పునాది దశను దాటాయి. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మానవ హక్కుల వేదిక ద్వారా నేషనల్ ట్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో పర్యావరణ అనుమతులు లేనందున భద్రాద్రి పనులు నిలిపేయాలని జెన్‌కోను ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్టే కోరుతూ టీఎస్ జెన్‌కో హైకోర్టును ఆశ్రయించింది. పర్యావరణ అనుమతులు లేనందున పనులెలా చేస్తారని హైకోర్టు సైతం జెన్‌కోను ప్రశ్నించింది. ఇందులో హైకోర్టు కేంద్ర పర్యావరణ శాఖను ప్రతివాదిగా చేర్చింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి వచ్చిన డిప్యూటీ డెరైక్టర్ కరుపయ్య గత నెల 9వ తేదీన ప్లాంట్ పనులను తనిఖీ చేసుకుని వెళ్లి.. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ సీరియస్‌గా పరిగణించడంతోపాటు హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ సైతం పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్న పనులపై ప్రశ్నించింది.

దీంతో 20 రోజుల కిందట ప్లాంట్ పనులు పూర్తిగా నిలిపేశారు. తిరిగి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయమై ఇప్పటివరకు స్పష్టత లేకుండా పోయింది. ఏ అధికారి సైతం ఈ విషయమై స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు సబ్ కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు రాకపోగా, యంత్రాలు ఆపివేయడంతో అవి దెబ్బతింటాయని ఆందోళనకు గురవుతున్నారు.

 సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అవలంబిస్తేనే అనుమతులు..
 మారిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, విద్యుత్ శాఖల నిబంధనల ప్రకారం 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంకన్నా ఎక్కువగా ఉంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉంది. అయితే 1080 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మిస్తున్నందున కాలుష్యం తక్కువగా వెదజల్లే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉంది. అయితే దీనికి విరుద్ధంగా కాలంచెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ మాత్రమే వాడుతుండడంతో కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయినప్పటికీ పనులు చేపట్టడంతో పరిస్థితి గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం బంతి హైకోర్టు పరిధిలో ఉంది. మరోవైపు కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఈ అంశాలపై హైకోర్టులో వాదనలు వినిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

ఈ క్రమంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ నుంచి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మారడంతోపాటు దీనికి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్ మారిస్తేనే పర్యావరణ అనుమతులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. పైగా ఇప్పటివరకు యుద్ధప్రాతిపదికన పనులు చేయడంతో జెన్‌కోపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీంతో టీఎస్ జెన్‌కో పునరాలోచనలో పడింది. మరోవైపు కాలం చెల్లిన మెటీరియల్ వదిలించుకునేందుకు బీహెచ్‌ఈఎల్ పనికిరాని పరికరాలను టీఎస్ జెన్‌కోకు అంటగట్టేందుకు ప్రయత్నించిందనే అనుమానాలను పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ టెక్నాలజీ, పరికరాలు మారిస్తేనే బీటీపీఎస్‌కు పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు