పేలియో చానెల్ సాధ్యం కాదు

21 Oct, 2014 00:42 IST|Sakshi
పేలియో చానెల్ సాధ్యం కాదు

నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం.పాండురంగారావు
 
హైదరాబాద్: తెలంగాణలో భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటిన నేపథ్యంలో పేలియో చానెల్ టెక్నాలజీతో గ్రామాలకు నీరందించడం సాధ్యపడదని వరంగల్ నిట్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో పదవీ విరమణ చేసిన జియో ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎం.పాండురంగారావు అన్నారు. వాటర్ గ్రిడ్ మినహా పేలియో టెక్నాలజీని తెలంగాణలో అమలు చేయడం కుదరదని స్పష్టంచేశారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వాగులు, నదుల్లో ఇసుక మినహా నీరే ప్రవహించనప్పుడు పేలియో టెక్నాలజీతో భూగర్భ మట్టిపొరల్లోని నీటిని సరఫరా చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. పేలియో టెక్నాలజీకి సంబంధించి నీటిపారుదల రంగనిపుణులు టి.హనుమంతరావు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించారు. వరంగల్  జిల్లా జనగాం దగ్గరనున్న యశ్వంతపూర్ వాగు, ఆలేరు వాగుల్లో ఇసుక తప్ప.. నీరు పారడం లేదని అలాంటప్పుడు ఎప్పుడో పూడుకుపోయిన పేలియో చానెల్‌ను గుర్తించినా లాభం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

పేలియో చానెల్స్ కోసం ఇదివరకే జియోఫిజికల్ సర్వే చేశామని వివరించారు. నీటికోసం వందల అడుగుల మేర బోర్లు వేస్తున్నా నీరు రావడం లేదని, అలాంటప్పుడు 40 నుంచి 50 అడుగుల లోతు మట్టిపొరల్లో నీరు ఎలా ఉంటుందని అన్నారు. ఒకవేళ ఉన్నా.. ఆ నీరు మొత్తం పక్కన వేసే బోర్లలోకి జాలువారుతుందని వివరించారు. తెలంగాణ దక్కన్ పీఠభూమి అని, భూమిలో ఎక్కువగా రాతి పొరలు ఉన్నందున, నీరు భూమిలోకి ఇంకడం కంటే.. దిగువకు వెళ్లిపోతుందని పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ కోసం తెలంగాణ మొత్తంలో జియాలజికల్, జియోఫిజికల్, హైడ్రాలజికల్ సర్వేలు చేశారని పేర్కొన్నారు. శాటిలైట్ వివరాలతోపాటు, పేలియో చానెల్స్‌ను కూడా మదింపు చేసినట్లు వివరించారు. పూడుకుపోయిన పేలియో చానెల్స్ ఉన్నా.. వాటిలో నీటి ప్రవాహం చాలా తక్కువ గా ఉంటుందన్నారు. ‘‘రాష్ట్రానికి అవసరమైన 90 టీఎంసీల నీటిని పేలియో చానెల్స్ నుంచి తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే ప్రస్తుతం పెద్దపెద్ద చెరువులను వాటర్‌గ్రిడ్‌తో అనుసంధానం చేయనున్నారు. ఉపరితల నీటిని శుద్ధి చేసి ప్రజలకు తాగునీరు అందించే దిశగా ప్రపంచం పయనిస్తోంది. ఇప్పుడు మళ్లీ భూగర్భ జలాల సరఫరా అంటే ఫ్లోరైడ్, ఇతర లవణాలతో ప్రజలకు అనేక సమస్యలు తలెత్తుతాయి’’ అని పాండురంగారావు వ్యాఖ్యానించారు.
 
 

మరిన్ని వార్తలు