తప్పుడు రిపోర్టు ఇచ్చిన ఆస్పత్రిపై ఫిర్యాదు

16 Dec, 2015 16:43 IST|Sakshi

తన కూతురుకు వచ్చిన జ్వరం డెంగ్యూగా నిర్ధారించి తీవ్ర ఆందోళనకు గురి చేశారంటూ ఓ వ్యక్తి వైద్యశాల నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శ్రీరామా పిల్లల ఆస్పత్రి ఉంది. ఈ ఆస్పత్రిలో గత నెల 15వ తేదీన కార్తీక్‌రెడ్డి అనే వ్యక్తి తన కూతురుకు వైద్యం చేయించారు.

అయితే, ఆమెకు డెంగ్యూ జ్వరం వచ్చిందని చెప్పటంతో హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించారు. అక్కడి వైద్యులు మాత్రం సాధారణ జ్వరంగా తేల్చారు. దీంతో కార్తీక్‌రెడ్డి.. తప్పుడు నివేదికతో తనను తీవ్ర ఆందోళనకు గురి చేసిన ఆస్పత్రి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఇటీవల డీఎంహెచ్‌వో ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు.

కాగా.. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలను ఆస్పత్రిపై తీసుకోలేదంటూ సదరు బాధితుడు బుధవారం సాయంత్రం ఒన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని సీఐ ఒన్‌టౌన్ సీఐ బిక్షం తెలిపారు.

మరిన్ని వార్తలు