ఖర్చు ఘనం.. చెత్త పదిలం!

30 Jul, 2014 03:49 IST|Sakshi
ఖర్చు ఘనం.. చెత్త పదిలం!
 •  రూ.కోట్లలో నిధులు వృథా      
 •  ఎక్కడి చెత్త అక్కడే      
 •  అధ్వానంగా పారిశుద్ధ్యం
 •  వానొస్తే చిత్తడి     
 •   పొంచి ఉన్న వ్యాధులు      
 •  ఇదీ గ్రేటర్ తీరు
 • సాక్షి, సిటీ బ్యూరో: జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, వ్యాధుల నివారణకు ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోతున్నారు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెత్త కుప్పలు...వ్యర్థాలతో నిండిపోయినా ఖాళీ కాని డంపర్ బిన్‌లు... మురికి గుంటలు...వాటిలో కుటుంబాలతో నివాసం ఉండే దోమలు... ఆస్పత్రుల్లో పెరుగుతున్న వ్యాధి పీడితులు...ఇదీ గ్రేటర్ చిత్రం. వ్యాధులు రాకుండా ఆదిలోనే అరికట్టేందుకు.. ప్రజల్లో అవగాహన పెంచేందుకు వైద్య నిపుణులను సైతం పారిశుద్ధ్య సేవల్లో వినియోగిస్తున్నారు.

  అదీ ఫలితమివ్వడం లేదు. అదే వైద్యులను ఆస్పత్రుల్లో నియమిస్తే అక్కడైనా సక్రమంగా సేవలందే అవకాశం ఉంటుందనే విమర్శలు ఎదుర్కోవడం తప్పితే ఉపయోగం ఉండడం లేదు. అదనపు సిబ్బందిని నియమిస్తున్నా ప్రయోజనం కానరావడం లేదు. కొన్ని కార్పొరేషన్ల వార్షిక బడ్జెట్ కంటే జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య నిర్వహణకు చేస్తున్న ఖర్చే ఎక్కువ. ఏటా దాదాపు రూ.300 కోట్లు పారిశుద్ధ్యానికి వెచ్చిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు.
   
  కారణాలెన్నో...

  అడుగడుగునా అవినీతి.. లెక్కలు, రికార్డుల్లో తప్ప,  క్షేత్ర స్థాయిలో కనిపించని సిబ్బంది. కాగితాల్లో మాత్రమే కనిపించే చెత్త తరలింపు.. వాహనాల అదనపు ట్రిప్పులు. కొందరు అధికారులు.. మరికొందరు
  కార్పొరేటర్ల సొంతలాభం .. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్యం క్షీణించడానికీ ఎన్నో కారణాలు. దీన్ని చక్కదిద్దేందుకు కొంతకాలంగా  ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కడదాకా సాగడం లేదు. ఇటీవల కొన్ని మార్గాల్లో పారిశుద్ధ్యం బాధ్యతను ప్రైవేటు కాంట్రాక్టర్లకు క ట్టబెట్టారు. అయినా ఏ మార్పూ కనిపించడం లేదు.
   
  పారిశుద్ధ్య నిర్వహణలో ఖర్చులు పరిశీలిస్తే...
   
  ఇది ఇళ్ల నుంచి వచ్చే చెత్తను వేసేందుకు అవసరమైన డంపర్‌బిన్‌ల కోసం చేసిన ఖర్చు. ఇవి కాక ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించేందుకు 5,638 రిక్షాలు ఉన్నాయి. వీటిలో 2691 రిక్షాలు మరమ్మతుల్లో ఉన్నాయి. రెండేళ్ల క్రితం వార్డుల్లోని చెత్తను తరలించేందుకు 3000 రిక్షాలను కార్పొరేటర్లకు ఇచ్చారు. త్వరలో మరో 1500 రిక్షాలు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
   
  భారీ వాహనాలు..
   
  డంప్ బిన్‌ల నుంచి చెత్తను ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు, అక్కడి నుంచి డంపింగ్ యార్డులకు తరలించేందుకు మొత్తం 564 వాహనాలను వినియోగిస్తున్నారు. వీటిలో 458 జీహెచ్‌ఎంసీవి కాగా, మరో 106 అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. ఇంకో 44 వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. ధరలో తేడా రావడంతో ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు.
       
  ఇవి కాక సీజన్ల వారీగా తీసుకునే అదనపు వాహనాలు.. అదనపు సిబ్బంది.. స్పెషల్ డ్రైవ్‌ల పేరిట అదనపు పనులు, ఇతరత్రా పనుల పేరిట వెరసి ఏటా దాదాపు రూ. 300 కోట్లు పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త తరలింపు తదితరాలకు ఖర్చు చేస్తున్నారు.

  వీఐపీలకే ప్రాధాన్యం     

  గ్రేటర్‌లో మొత్తం 6411 కి.మీ.ల మేర రహదారులు ఉన్నప్పటికీ, వీఐపీలు ఉండే మార్గాలు..వారు ప్రయాణించే రహదారులు. ప్రధాన రహదారుల్లో మాత్రమే పారిశుద్ధ్య పనులు సవ్యంగా చేస్తున్నారు. మిగతా ప్రాంతాలను గాలికి వదిలేస్తున్నారు. వీఐపీలు ఉండేవి, ప్రధాన రహదారులు కలిపి దాదాపు 2 వేల కి.మీ. ఉన్నాయి.
       
  పారిశుద్ధ్య పనులకు దిగువ స్థాయి కార్మికుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఉన్నారు. కార్మికుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే శానిటరీ సూపర్‌వైజర్ల నుంచి మొదలు పెడితే.. శానిటరీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (ఏఎంఓహెచ్), డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్‌లు ఈ కార్యక్రమాల పర్యవేక్షణకు పని చేస్తున్నారు. కార్మికులు దాదాపు 18 వేల మంది ఉండగా, శానిటరీ సూపర్‌వైజర్లు వేయిమంది  ఉన్నారు. 18 మంది డిప్యూటీ కమిషనర్లు, ఐదుగురు జోనల్ కమిషనర్లు ఉన్నారు.
   
  పొంచి ఉన్న వ్యాధులు

  వర్షాకాలంలో వ్యర్థాలు త్వరితంగా కుళ్లి దుర్గంధం వెదజల్లే పరిస్థితులు ఎక్కువ. దీన్ని చక్కదిద్దేందుకు, చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వర్షాకాలంలో ప్రత్యేక ఏర్పాట్లంటూ లేవు. దీంతో వర్షాలొస్తే దోమలు, ఈగలు, క్రిమికీటకాలు వృద్ధిచెంది రోగాలు వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. నగరంలో ఈ ఏడాది ఇంకా గట్టి వర్షాలే కురియలేదు.
   
  అయినప్పటికీ అనేక సర్కిళ్లలో ఇప్పటికే మలేరియా, డెంగీ వంటి కేసులు గుర్తించారు. మలక్‌పేట, చార్మినార్, కార్వాన్, హిమాయత్‌నర్, ఆబిడ్స్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఎల్‌బీనగర్ సర్కిళ్లలో 73 మలేరియా కేసులు, ఆబిడ్స్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ సర్కిళ్ల పరిధిలో నాలుగు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే రోగాలు ప్రబలే ఆస్కారం ఉంది.

   

మరిన్ని వార్తలు