పెద్దషాపూర్‌లో రైల్వే క్రాసింగ్ స్టేషన్ ఏర్పాటుకు..

26 Jun, 2014 23:20 IST|Sakshi
పెద్దషాపూర్‌లో రైల్వే క్రాసింగ్ స్టేషన్ ఏర్పాటుకు..

వేగిరమైన భూసేకరణ పనులు  
 
శంషాబాద్ రూరల్:
మండలంలోని పెద్దషాపూర్ సమీపంలో రైల్వే క్రాసింగ్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. ఉందానగర్ (శంషాబాద్)- తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ల మధ్యలో పెద్దషాపూర్ సమీపంలోని 18/ఇ రైల్వే గేటును విస్తరించి క్రాసింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం భూసేకరణను వేగిరం చేశారు. ఇక్కడ రైల్వే ట్రాక్‌ల ఏర్పాటు, రైల్వే స్టేషన్ నిర్మాణానికి సుమారు 6 ఎకరాలు సేకరించనున్నారు. నాలుగేళ్ల క్రితం క్రాసింగ్ స్టేషన్ నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ తర్వాత స్థల సేకరణ, ఇతర అనుమతుల మంజూరులో జాప్యం నెలకొంది. పనులు చేపట్టడానికి కావాల్సిన స్థలాన్ని ఇది వరకే గుర్తించి, హద్దురాళ్లు పాతారు.
 
భూసేకరణ కోసం ఇవ్వాల్సిన నష్టపరిహారంలో కొంత మొత్తాన్ని రైల్వే శాఖ ప్రభుత్వానికి జమ చేసినట్లు తెలుస్తోంది. భూసేకరణ కోసం గుర్తించిన భూముల్లో ఎంత మంది రైతులు ఉన్నారు, వారికి ఎంత నష్ట పరిహారం చెల్లించాలో నిర్ధారించడానికి గురువారం రెవె న్యూ, సర్వే అధికారులు వివరాల సేకరణ మొ దలుపెట్టారు. ఇక్కడ రైల్వే ట్రాక్‌కు రెండు వైపులా సుమారు కిలో మీటరు దూరం వరకు భూసేకరణ చేయనున్నారు. ఇక్కడ చాలా వరకు పట్టా భూములే ఉన్నాయి. వీటిలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
 
మరికొంత స్థలం ప్రభుత్వం, చెరువు శిఖం ఉన్నట్లు సమాచారం. రైల్వే క్రాసింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్న ఈ ప్రాంతం సమీపంలో కుసుమసముద్రం చెరువు ఉంది. గతంలో ఈ చెరువు నుంచి వంతెనపై రైల్వే ట్రాక్ ఏర్పాటు చేశారు. క్రాసింగ్ స్టేషన్ పనులకు ఈ చెరువు అడ్డంకిగా మారడంతో ట్రాక్‌లను మరో వైపు పొడిగించడానికి ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఉ న్న రైల్వే గేటు గదిని మార్చి, స్టేషన్‌లోకి రాకపోకలు సాగించడానికి రెండు ప్రత్యేక మార్గాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమా చా రం.
 
ఇక్కడే ఎందుకు?
రైల్వే క్రాసింగ్ స్టేషన్‌ను పెద్దషాపూర్ సమీపంలోనే ఏర్పాటు చేయడానికి బలమైన కారణాలున్నాయి. ఉందానగర్- తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 15 కి.మీ. దూరం ఉంటుంది. ఈ రూట్లో రాకపోకలు సాగించే పలు రైళ్లు క్రాసింగ్ చేయడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని తిమ్మాపూర్ వద్ద క్రాసింగ్ కోసం సౌకర్యాలు ఉన్నాయి. ఆ తర్వాత నగరం వైపు ట్రాక్‌పై మరో చోట క్రాసింగ్ అవకాశాలు చాలా తక్కువ. ఉందానగర్ రైల్వే స్టేషన్‌లో సైతం క్రాసింగ్‌కు సరైన స్థలం లేదు. దీంతో హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లు కేవలం తిమ్మాపూర్ వద్దనే క్రాసింగ్ కావాల్సి ఉంటుంది.
 
ఆ తర్వాత కాచిగూడ వచ్చే వరకు క్రాసింగ్ సౌకర్యం లేక రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తే రైళ్ల క్రాసింగ్ సమస్య మరింత జఠిలం కానుంది. దీంతో నగరం నుంచి బయటకు వచ్చిన తర్వాత రైళ్లను క్రాసింగ్ చేయడానికి పెద్దషాపూర్ రైల్వే గేటు అనువుగా ఉన్నట్లు రైల్వే శాఖ గుర్తించింది.
 
స్టేషన్ ఏర్పాటుతో రవాణా వ్యవస్థ మెరుగు

పెద్దషాపూర్ శివారులో చౌదరిగూడ వెళ్లే దారిలోని రైల్వే గేటు వద్ద క్రాసింగ్ స్టేషన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేసి ైరె ళ్లను నిలిపితే సమీప గ్రామాల వారికి రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. స్థానిక ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు.

ఇక్కడ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే రైతులు పండించిన కూరగాయలు, పూలు, పాలను నగరానికి తరలించడానికి మరింత సౌకర్యంగా ఉంటుంది. సమీపంలోని నర్కూడ, జూకల్, కాచారం, పిల్లోనిగూడ, పాల్మాకుల, ఘాంసిమియాగూడ, మదన్‌పల్లి, తదితర గ్రామాల రైతులకు మేలు చేకూరుతుంది. ఉద్యోగాలు, విద్యాభ్యాసం కోసం నగరానికి రాకపోకలు సాగించే ఆయా గ్రామాల వారికి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. మరో వైపు ఈ ప్రాంతం అభివృద్ధికి క్రాసింగ్ స్టేషన్ ఏర్పాటు దోహదపడుతుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు