సీపీఐ జైలుభరో ఉద్రిక్తం

15 May, 2015 00:51 IST|Sakshi

పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట.. పలువురి అరెస్ట్
పేదల భూములు గుంజుకుంటే గోరి కడతాం
జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి
భూసేకరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్

 
 ముకరంపుర : రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రూపొందించిన భూసేకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట జైలు భరో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు సీపీఐ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని బైఠాయించారు. ‘మన భూములపై మన హక్కులను కాపాడుకుందాం’ అంటూ నినాదాలు చేశారు.

దాదాపు రెండు గంటల ధర్నా చేసిన అనంతరం ఒక్కసారిగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరి గింది. కార్యకర్తలను బలవంతంగా ఈడ్చుకెళ్లే క్రమంలో పలువురి చొక్కాలు చిరిగాయి. కొందరు కార్యకర్తలు గాయాలపాలయ్యారు. పోలీసులు 150 మందికి పైగా కార్యకర్తలను అరెస్ట్ చేసి కరీంనగర్ వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు.

 మోడీ సర్కారు గోరీ కడుతాం..
 ఈ సందర్బంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ... భూసేకరణ బిల్లు ద్వారా రైతుల భూములను గుంజుకుంటే కేంద్ర ప్రభుత్వానికి గోరీ కడతామన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న బలవంతపు భూసేకరణ చట్టం భూమిని కొందరి చేతుల్లో కేంద్రీకరించడానికి దోహదపడుతుందన్నారు. ప్రజ లు భూములు కోల్పోవడంతో సామాజిక అశాంతి నెలకొనే ప్రమాదముందని, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని ఆరోపించారు.

కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూర్చే ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉజ్జని రత్నాకర్‌రావు, రాష్ట్ర కౌన్సిల్ సబ్యుడు బోయిని అశోక్, నాయకులు కూన శోభారాణి, కర్రె భిక్షపతి, గూడెం లక్ష్మి, పొనగంటి కేదారి, సీపీఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు, పెండ్యాల ఐలయ్య, అందె స్వామి, వేల్పుల బాలమల్లు, పంజాల శ్రీనివాస్, మారుపాక అనిల్‌కుమార్, కాల్వ నర్సయ్య, కొయ్యడ సృజన్‌కుమార్, గుంటి వేణు, బి.మహేందర్, సూర్య, ఎనగందుల రాజయ్య, రవి, రవీందర్‌రెడ్డి, వెంకటరమ ణ,కనకయ్య, కిన్నెర మల్లమ్మ,సంతోష్‌చారి, మణికంఠరెడ్డి, మల్లేశ్, రాజ్‌కుమార్, జక్కు రాజుగౌడ్, జైపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, చెప్యాల వేణు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు