వైకల్యం కన్నా... స్నేహం మిన్న

4 Aug, 2014 03:06 IST|Sakshi

 దేవరకద్ర రూరల్ : ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు... ఇద్దరూ ప్రాణ స్నేహితులు... ఇందులో ఒకరికి కళ్లులేవు. మరొకరికి బుద్ధిమాంధ్యం ఉంది. ఎప్పుడూ కలిసిమెలసి ఉండే వీరు స్నేహితుల దినోత్సవమైన ఆదివారం దేవరకద్ర నుంచి గద్దెగూడేనికి వె ళుతూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. వారిని పలకరించగా స్నేహబంధాన్ని వివరించారు. ఆస్తి, అంతస్తులు చూస్తున్న ఈ రోజుల్లో పుట్టుకతోనే శారీరకలోపంతో సతమతమయ్యే తాము 30ఏళ్ల క్రితమే స్నేహితులుగా మారామన్నారు. మహబూబ్‌నగర్‌లోని టీడీగుట్టకు చెందిన మహబూబ్‌పాషా పుట్టుకతోనే అంధుడు, అదే ప్రాంతానికి చెందిన కృష్ణకు బుద్ధిమాంధ్యం ఉంది.

అప్పటి నుంచి ఒకరిని విడిచి మరొకరు ఉండరు. తన కళ్లతో కృష్ణ స్నేహితుడు మహబూబ్‌పాషాకు లోకాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడికెళ్లినా కృష్ణ భుజంపై చేయి వేసి నడుస్తాడు. యాచించిన డబ్బులను ఇద్దరూ సమానంగా పంచుకుంటారు. వారు కలిసే తింటారు, ఉంటారు. వైకల్యం ముందు స్నేహం మిన్న అన్న చందంగా వీరు ముందుకు సాగుతున్నారు. కులమతాలు వేరైనా స్నేహానికి అవేమీ సాటిరావన్న నానుడిని నిజం చేస్తున్నారు. మనసుండాలే కాని స్నేహానికి కొదవలేదని చాటి చెబుతున్నారు.

మరిన్ని వార్తలు