మన పదవి మనకే

27 May, 2016 02:22 IST|Sakshi
మన పదవి మనకే

జిల్లా అభ్యర్థికే రాజ్యసభ టికెట్
కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు అవకాశం
గుండు సుధారాణికి మొండిచేరుు

 
 
 సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాజ్యసభ ఎన్నికల్లో జిల్లాకు మరోసారి ప్రాధాన్యం దక్కింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కెప్టెన్ వడితెల లక్ష్మీకాంతరావుకు అవకాశం వచ్చింది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కెప్టెన్ అభ్యర్థిత్వాన్ని గురువారం ప్రకటించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కీలకంగా పనిచేస్తున్న లక్ష్మీకాంతరావుకు అరుదైన  అవకాశం కల్పించారు. టీఆర్‌ఎస్‌కు శాసనసభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావ డం లాంఛనమే. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగానూ వీరిద్దరి మధ్య సాన్నిత్యం ఉంది. టీఆర్‌ఎస్ ప్రస్థానంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో కెప్టెన్ లక్ష్మీకాంతరావు పాత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ అయిన లక్ష్మీకాంతరావుకు కీలకమైన రాజ్యసభ సభ్యత్వం వచ్చింది.


సుధారాణికి ఆశాభంగం...
జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. రాపోలు ఆనందభాస్కర్, గరికపాటి మోహన్‌రావు, గుండు సుధారాణి రాజ్యసభ స భ్యులుగా ఉండగా ఇప్పుడు గుండు సుధారాణికి బదులుగా లక్ష్మీకాంతరావు ఎన్నికవుతుండడంతో జిల్లాలోని రాజ్యసభ సభ్యుల సంఖ్యలో మార్పు ఉండదు. జిల్లాకు చెందిన గుండు సుధా రాణి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. గుండు సుధారాణి 2010లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు ముందు గత ఏడాది అక్టోబరులో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరారు. రాజ్యసభ సభ్యత్వంపై హామీతోనే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ఆమె పలుసార్లు తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు.

మార్చిలో జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో సుధారాణి కోడలు అశ్రీతారెడ్డికి టీఆర్‌ఎస్ కార్పొరేటర్ టికెట్ వచ్చింది. అనంతరం సుధారాణి తన కోడలు అశ్రీతారెడ్డికి మేయర్ పదవి కోసం పలు ప్రయత్నాలు చేశారు. కానీ, టీఆర్‌ఎస్‌లో కీలకంగా పనిచేసిన నన్నపునేని నరేందర్‌కు ఈ పదవి దక్కింది. దీంతో సుధారాణి మళ్లీ రాజ్యసభ సభ్యత్వం కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి తుమ్మల నాగేశ్వర్‌రావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవి సైతం రాలేదు. దీంతో గుండు సుధారాణి అనుచరుల్లో నైరాశ్యం నెలకొంది. గుండు సుధారాణి రాజ్యసభ పదవీకాలం జూన్ 21తో ముగుస్తోంది. రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు మే 31 చివరి రోజుగా నిర్ణయించింది. జూన్ 11న పోలింగ్ జరగనుంది.


 లక్ష్మీకాంతరావు రాజకీయ జీవితం ఇదీ..
 లక్ష్మీకాంతరావు రాజకీయ జీవితం కాంగ్రెస్‌తో మొదలైంది. లక్ష్మీకాంతరావు సోదరుడు వడితెల రాజేశ్వరరావు 1972 ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1992 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. లక్ష్మీకాంతరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1983 నుంచి 1995 వరకు సింగాపురం గ్రామానికి ఏకగ్రీవ సర్పంచ్‌గా పనిచేశారు. ఇదే గ్రామానికి ఒకసారి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2004 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004 జూన్ నుంచి 14 నెలలపాటు మంత్రిగా పనిచేసి రాజీనామా చేశారు. 2008లో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉపఎన్నికలో తిరిగి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన 2009 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్ కన్వీనర్‌గా, ఆ తర్వాత  రాష్ట్ర కమిటీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు.
 
 
 భారత సైన్యంలోనూ..
 లక్ష్మీకాంతరావు చదువుకునే రోజుల్లో ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్‌లో రాష్ట్ర స్థాయి ఉత్తమ కేడెట్‌గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత 1963లో సీనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా భారత సైనిక దళంలో చేరారు. 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. రక్ష మెడల్ పొందారు. 1968 లో సైనిక సేవల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం కాకతీయ, ఆంధ్ర యూనివర్సిటీల సెనేట్ సభ్యుడిగా పనిచేశారు. హసన్‌పర్తి, హుజూరాబాద్, రాంటెక్(నాగపూర్)లో ఇంజనీరింగ్ కాలేజీలు, హైదరాబాద్‌లో విజేత పబ్లిక్ స్కూల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు