గుట్టుగా గుట్కా దందా

4 Apr, 2016 03:37 IST|Sakshi
గుట్టుగా గుట్కా దందా

జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా విక్రయాలు
రోజుకు లక్షల్లో వ్యాపారం
నకిలీ సరుకు సరఫర
క్యాన్సర్‌తో పాటు వివిధ రోగాలు తప్పవంటున్న వైద్యులు

 
గుట్కాదందా జిల్లా కేంద్రంలో గుట్టుగా సాగుతోంది. గుట్కాను ప్రభుత్వం నిషేధించినా జిల్లా కేంద్రంలో మాత్రం విచ్ఛలవిడిగా విక్రయిస్తున్నారు. ఇవి నమిలితే క్యాన్సర్‌తోపాటు వివిధ రోగాల బారినపడటం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో గుట్కా విక్రయాలపై నిషేధం ఉన్నా ఎక్కడా ఆగడంలేదు. ఇప్పటి వరకు పట్టణంలో మూడు, నాలుగు సార్లు మాత్రమే అధికారులు దాడులు చేశారు.  - మహబూబ్‌నగర్ క్రైం

 
 నకిలీవి మరింత ప్రమాదకరం
గుట్కాలు అనారోగ్యం ఖాయమని తెలిసిం దే. కానీ వీటిలో కూడా నకిలీ సరుకు విచ్ఛలవిడిగా విక్రయిస్తున్నారు. ఇవి అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నా రు. జిల్లా కేంద్రానికి హైదరాబాద్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి గుట్కా, తంబాకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని పాన్‌షాపులు, కిరాణషాపులు, టీకొట్టు వద్ద వీటి విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్కో గుట్కా రూ.3లకు విక్రయిస్తున్నారు. నిత్యం దాదాపు రూ.200వరకు బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. కొన్నిరకాల సాదా గుట్కా(పాన్ మసాలా)తో తంబాకు ప్యాకెట్ ఉచితంగా ఇస్తున్నారు. ఇవి రెండు కలిపితే అది గుట్కాగా మారుతోంది.

హోల్‌సేల్ వ్యాపారులు కూడా తంబాకు, పాన్ మాసాల ఒకేసారి విక్రయిస్తున్నారు. వినియోగదారుల నుంచి ధరపై రెండు, మూడింతలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీంతో గుట్కాలు తినే వారు రెండు రకాలుగా నష్టపోతున్నారు. మాములుగా ఒక వ్యక్తి రోజులో పది నుంచి 20గుట్కాల వరకు తింటున్నారు. ఉన్న ధర కంటే రెండుమూడింతలు ఎక్కువ ధరకు అమ్మకాలు చేయడం వల్ల ఈవ్యాపారం రోజూ లక్షల్లో సాగుతోంది.
 
 కనిపించని తనిఖీలు..
నిషేధిత గుట్కాల విక్రయాలను అరికట్టేందుకు పోలీసులతోపాటు పురపాలక, పంచాయతీ శాఖ, ఆహార తనిఖీ అధికారి, ఆర్టీఓ, కార్మికశాఖ, విజిలెన్స్ అధికారులు ఈ విక్రయాలను అరికట్టేందుకు దాడులు నిర్వహించవచ్చు. కానీ ఎక్కడా ఆశించిన స్థాయిలో దాడులు జరగడం లేదు. నామమాత్రంగా అప్పుడుప్పడు పోలీ సులు మాత్రమే ఈ గుట్కా విక్రయాలను పట్టుకుంటున్నారు. పలుచోట్ల దర్జాగా దుకాణాల్లో నిల్వ ఉంచి సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా వీరన్నపేట, వన్‌టౌన్, భగిరథకాలనీ, ఆకుల చౌరస్తా, క్లాక్‌టవర్, మార్కెట్ రోడ్, పాత బస్టాండ్, న్యూటౌన్‌లోని మున్సిపాల్ కాంప్లెక్స్, జిల్లాసుపత్రి ఎదురుగా ఉన్న హోటళ్లలో, పద్మావతికాలనీ, శ్రీనివాసకాలనీ, రాజేంద్రగనర్ ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లో జోరుగా ఈ వ్యాపారం సాగుతుంది.
 
 జీర్ణవ్యవస్థపై  తీవ్ర ప్రభావం
గుట్కాలు తినే వారిలో మొదట జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దీంతోపాటు అల్సర్‌కు దారి తీస్తుంది. ముఖ్యంగా నోటి క్యాన్సర్ వస్తుంది. దానివల్ల ప్రాణహాని కూడా ఉంటుంది. దానితో పాటు కడుపులో ఉన్న పేగులకు చిన్నచిన్న పుండ్లు అవుతాయి. ముఖ్యంగా నోటిలో చిగుర్ల వాపు, దంతాలు చెడిపోవడం ఇతర రకాల సమస్యలు వస్తాయి. ఇలాంటి చెడు అలవాట్లకు ప్రతిఒక్కరూ దూరంగా ఉండటం మంచిది.  
 - డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జనరల్  ఫిజీషియన్

>
మరిన్ని వార్తలు