ఆంగ్లభాషదే ఆధిపత్యం

8 Sep, 2016 04:25 IST|Sakshi
ఆంగ్లభాషదే ఆధిపత్యం

విద్యారంగంలో తెలుగుకు ప్రాధాన్యత తగ్గింది: కవిత

జిల్లాపరిషత్ (నిజామాబాద్): రాష్ట్రంలో ఆంగ్లభాష ఆధిపత్యం కొనసాగుతోందని,  విద్యారంగంలో తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గిందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. మాతృభాషలో మాట్లాడుతుంటే తనకు ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. బుధవారం నిజామాబాద్‌లో తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలుగు భాషపై చర్చాగోష్టి నిర్వహించారు.  కవిత మాట్లాడుతూ దేశంలో మాతృభాషలకు ప్రాధాన్యం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.  విద్యావ్యవస్థలో లోపాలను సవరించి గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్యలో తప్పకుండా తెలుగుభాష ఉండేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండే భాషకే ప్రాధాన్యమిస్తామని కేంద్రప్రభుత్వం భాషపై వేసిన సుబ్రహ్మణ్యం కమిటీతో చెబుతామన్నారు. సభాధ్యక్షత వహించిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చుక్కా రామయ్య మాట్లాడుతూ భాషకు, విద్యావ్యవస్థకు ముడిపడి ఉంటుందన్నారు. ప్రస్తుతం విద్యావ్యవస్థ చాలా క్లిష్టపరిస్థితుల్లో ప్రయాణాన్ని కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాషగా తెలుగును అంగీకరించాలన్నారు. రాష్ట్రంలో భాష పాలసీ రాకపోవడానికి తెలుగు అకాడమీ నిర్వహణ లోపమే కారణమన్నారు. తెలుగుభాష పరిరక్షణ సమితి కన్వీనర్ డాక్టర్ వెల్చాల కొండలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా విధానం, భాషావిధానంలో చాలా లోపాలు ఉన్నాయన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో భాష చాలా కీలకపాత్ర పోషించిందని, కేసీఆర్ మాట్లాడిన భాషే ప్రజలను ప్రభావితం చేసిందని గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దేశం అభివృద్ధి చెందలేదని, అందుకు కారణం విద్యావిధానమే అన్నారు. ఆంధ్రపాలకులు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారని, కార్పొరేట్ కళాశాలలను ఏర్పాటుచేసి వ్యాపారం చేశారని విమర్శించారు. ఇంగ్లిష్ నేర్చుకోవడం వల్ల ఉద్యోగాలు రావడంలేదని, జ్ఞానం, స్కిల్స్, నాలెడ్జ్ ఉన్న వారికే వస్తున్నాయన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలని సూచిం చారు. రాష్ట్రంలో పరిపాలనా భాష తెలుగులో ఉన్నా.. బోధనా భాష మాత్రం ఇంగ్లిష్‌లో ఉందని పేర్కొన్నారు.

మనభాషకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చర్చాగోష్టిలో అతిథులు సహా తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సంఘాల ప్రతినిధులు, రచయితలు, భాషాప్రియులు, తెలుగు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ వీసీ సాంబయ్య, టీయూ పూర్వ రిజిస్ట్రార్ లింబాద్రి, తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు యాదగిరి, జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు