‘మిషన్’ మాయ..

12 Jan, 2016 01:23 IST|Sakshi

బిల్లుల కోసం నీరు నింపుతున్న కాంట్రాక్టర్
తీయని పూడిక తీతలు దాచేందుకే..
అధికార లెక్కల్లో పూర్తయిన ‘దయ్యాలకుంట’ చెరువు
ఏజెన్సీ ప్రాంత పనుల్లో అంతులేని అక్రమాలు

 
వరంగల్ :  చేయని పనులు దాచేందుకు ప్రైవేటు బోరు నీటితో చెరువును నింపుతున్న విచిత్ర కార్యక్రమాన్ని ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారంలో ఓ కాంట్రాక్టర్ చేపట్టాడు.  మిషన్ కాకతీయ కార్యక్రమంలో ఏటూరునాగారం మండలంలో 22 చెరువులు మంజూరయ్యా యి. వాటితో పాటు మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న అకులవారి ఘనపురంలోని దయ్యాలకుంటకు రూ.11.65 లక్షలు కేటాయించగా రూ.11.61 లక్షలకు పరిపాలన మంజూరు ఇచ్చారు. ఈ పనులు పొందిన కాంట్రాక్టర్ పూడికతీతలో భాగంగా సుమారు 12 ట్రాక్టర్ల మట్టి తీసినట్లు చెరువు ఆయకట్టు రైతులు తెలిపారు. కానీ లెక్కల్లో మాత్రం పెద్ద ఎత్తున పూడిక తీసినట్లుగా బిల్లు పొందినట్లు తెలిసింది. ఈ చెరువు పనులు మొత్తం పూర్తయినట్లు స్థానిక ఐబీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక కూడా అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 1068 చెరువులు మిషన్-1లో మరమ్మతులు చేపట్టగా అందులో 5 చెరువులు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. మిగి లిన పనులు పురోగతిలో ఉన్నట్లు నివేదకల్లో పొందుపర్చారు. ఈ చెరువు పనులను క్షేత్ర స్థాయిలో ‘సాక్షి’ పరిశీలించగా అసలు పనులు ఏమాత్రం జరిగిన దాఖలాలు కనిపించలేదు.

చెరువులోకి నీరు పంపింగ్...
ఇప్పటి వరకు చెరువు నుంచి పొలాలకు నీరు పంపింగ్ చేసుకోవడం చూశాం. కానీ ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘనపురంలోని దయ్యాలకుంట చెరువులోకి బోర్ నీరు పంపింగ్ చేయడం అశ్చర్యం కలిగిస్తోంది. ఈ చెరువులో ఎలాంటి పూడిక తీయకుండానే కొంత మేరకు బిల్లులు పొందినట్లు సమాచారం. ఈ చెరువు పనులు వంద శాతం పూర్తయినట్లు స్థానిక ఐబీ ఇంజనీర్లు నివేదికలు సమర్పించారు. మిగిలిన బిల్లులు పొందాలంటే మరింత పూడిక తీసినట్లు ఎంబీలు రికార్డు చేయాల్సిన పరిస్థితి. ఎంబీ రికార్డు ప్రకారం ఫైనల్ బిల్లు చేస్తే క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. అప్పుడు ఎలాంటి అక్రమాలు వెలుగు చూడకుండా ఉం డేందుకు కాంట్రాక్టర్లు, అధికారులు కలసి ఈ ఉపాయం పన్నినట్లు ప్రచారం జరుగుతోంది. చెరువు ప్రారంభంలో ఇటీవల కొంత మట్టి తీసి ఆ మట్టి వరకు ముంపునకు గురయ్యే విధంగా పక్కనే ఉన్న వ్యవసాయ పొలం నుంచి బోరు ద్వారా గత మూడు రోజులుగా నీటిని పంపింగ్ చేస్తున్నారని రైతులు అరోపిస్తున్నారు. ఈ చెరువు పనులు పూర్తయ్యాయా అని సంబంధిత డీఈఈ సత్యనారాయణను ఫోన్‌లో ప్రశ్నించగా ఆయన ‘మీటింగ్‌లో ఉన్నా...తర్వాత మాట్లాడ’మని అన్నారు.
 
 
మరమ్మతు పనులు చేయలే...

దయ్యాలకుంటలో కేవలం 12 ట్రాక్టర్ల మట్టి పూడిక తీశారు. తర్వాత ఎలాంటి పనులు చేయలేదు. చెరువు కట్ట, మత్తడి పనులు చేపట్టలేదు. పూడిక తీస్తే బాగుండేది. ఈ అక్రమాలపై విచారణ జరిపించాలి.
 - జాడి సమ్మయ్య, ఆయకట్టు రైతు
 

మరిన్ని వార్తలు