ఉల్లాసం.. ఉత్సాహం

27 Oct, 2014 00:50 IST|Sakshi
  • ఒక్కచోట చేరిన ‘పోరూరి’ వారి కుటుంబాలు
  • ఆడిపాడి సందడి
  • ఏడాదికోసారి గెట్ టుగెదర్
  • సామాజిక సేవలోనూ ముందుకు
  • ప్రపంచంలో ఉన్నవారంతా ఒక్కచోట చేరాలన్న సంకల్పం
  • మల్కాజిగిరి: వారంతా వేర్వేరు కుటుంబాలకు చెందిన వారైనా ఇంటి పేరు మాత్రం ఒక్కటే. ‘పోరూరి’ ఇంటిపేరు గల వారంతా ఏడాదికోసారి ఓ చోట చేరి సందడి చేస్తుంటారు. అలాగే ఈసారి కూడా కలిసి సంబరాలు చేసుకున్నారు. ఆదివారం మల్కాజిగిరిలోని శంకరమఠం (కనకరాజుతోట)లో గెట్ టుగెదర్ సందర్భంగా అంతా ఒక్కచోట చేరారు. చిన్నా, పెద్ద అంతా కలిసి ఆడిపాడి సందడి చేశారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు. యూఎస్‌ఏలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన పోరూరి సురేన్‌కుమార్ 2008 నుంచి గెట్ టు గెదర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

    ఈసారి నగరానికి వచ్చి మల్కాజిగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తనతోపాటు దేశంలోని ఆయా ప్రాంతా ల్లో స్థిరపడిన 70 కుటుంబాలకు చెందిన వారు విచ్చేసినట్టు సురేన్‌కుమార్ తెలిపారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పోరూరి పేరున్న కుటుంబాలు 450కిపైగా ఉన్నాయన్నారు. అందులో 250 కుటుంబాల వివరాలు సేకరించినట్టు తెలిపారు. వారిలో ప్రముఖ క్రీడాకారులు లక్ష్మి పోరూరి, మౌనిక పోరూరి తదితరులు ఉన్నారన్నారు.
     
    తమ ఇంటిపేరుతో ప్రపంచంలో ఉన్న వారమంతా ఇలా ఒకరోజు ఓ చోట చేరి ఆనందంగా గడపాలన్నది తమ సంకల్పమని ఆయన తెలిపారు. అంతేకాదు సమాజానికి సేవ చేయాలన్న ఆలోచనతో రెండేళ్ల క్రితం ‘అంగీరస చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేశామన్నారు.
     
    చదువుపై ఆసక్తి ఉండి ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఈ ట్రస్ట్ ద్వారా చేయూతనందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 20 మంది విద్యార్థులకు రిటైర్డ్ పోలీస్ అధికారి డీవీఎల్‌ఎన్ రామకృష్ణారావు చేతుల మీదుగా నగదు పారితోషకాన్ని అందించినట్టు తెలిపారు.
     

>
మరిన్ని వార్తలు