సులభతర బోధన కోసమే డిజిటల్ విధానం

17 Nov, 2016 03:36 IST|Sakshi
సులభతర బోధన కోసమే డిజిటల్ విధానం

- దీనికి, ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధం లేదు
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతి పాఠశాలను డిజిటలైజేషన్ చేస్తాం
- బంజారాహిల్స్ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూమ్ ప్రారంభించిన కడియం
- రెండేళ్లలో ఇంటింటికీ ఇంటర్నెట్: కేటీఆర్
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సులభంగా బోధించడం కోసమే డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చాం. దీనికి, ఉపా ధ్యాయుల సంఖ్యకు సంబంధం లేదు. టీచర్ల సంఖ్యను తగ్గిస్తామనే ఆందోళన వద్దు’’అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నా రు. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 8 లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూమ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 5,415 ఉన్నత పాఠశాలలున్నారుు. వీటిలో ప్రస్తుతం 3,352 పాఠశాలల్లో డిజిటల్ తరగతుల్ని ప్రారంభించాం. దేశంలో ఇంతపెద్ద సంఖ్యలో డిజిటల్ తరగతుల బోధన చేపట్టింది మన రాష్ట్రమే. వచ్చే ఏడాది మిగతా అన్ని పాఠశాలల్లో ఈ విధానాన్ని తీసుకొస్తాం. మనటీవీ ద్వారా ప్రసారాలు అందిస్తున్నాం. ఇందులో రెండు సౌకర్యాలున్నారుు. ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఆన్‌లైన్ పద్ధతిలో, లేనప్పుడు ఆఫ్‌లైన్ పద్ధతిలో పెన్‌డ్రైవ్ వినియోగించి పాఠ్యాంశ బోధన చేపట్టవచ్చు’’అన్నారు. డిజిటల్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించిన ఆయన.. ఎనిమిదో తరగతిలో జీర్ణవ్యవస్థ, దంత వ్యవస్థకు సంబంధించిన పాఠాన్ని విద్యార్థులతో కలసి విన్నారు.
 
 పేదలకు మెరుగైన విద్య కోసం: కేటీఆర్
 పేద, మధ్యతరగతి విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, వారికి మెరుగైన విద్య అందించేందుకు డిజిటల్ క్లాస్‌లను అందుబాటులోకి తెచ్చామని ఐటీశాఖ మంత్రి కె.తారకరామా రావు పేర్కొ న్నారు. బుధవారం ఉదయం మనటీవీ కార్యాలయంలో డిజిటల్ క్లాస్ ప్రారంభో త్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియంతో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ‘‘వచ్చే రెండే ళ్లలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తాం. రాష్ట్రంలో కోటి మందిని డిజిటల్ అక్షరా స్యులుగా తీర్చి దిద్దుతాం’’అని అన్నారు. మనటీవీ ద్వారా రాష్ట్రంలో 250 గంటల పాటు ఐదున్నర లక్షల మందికి గ్రూప్-2 పాఠాలను ప్రసా రం చేశామని, మనటీవీ సేవల్ని మరింత విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, పాఠశాల విద్యాశాఖ సంచా లకులు కిషన్, గురుకుల ఆశ్రమ పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్ డీఈవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
 
 భవిష్యత్తులో సబ్జెక్టు నిపుణులతో ఫోన్ ఇన్!  
 డిజిటల్ తరగతుల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ కసరత్తు
 సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,352 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో డిజిటల్ తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే. డిజిటల్ తరగతులకు తోడు విద్యార్థుల సందేహాల నివృత్తికి సబ్జెక్టు నిపుణులతో ఫోన్‌ఇన్ వంటి కార్యక్రమాలు ప్రారంభించాలని భావిస్తోంది. ప్రస్తుతం 6 నుంచి 9వ తరగతి వరకు సామాన్య, సాంఘిక, గణిత శాస్త్రాల్లో డిజిటల్ పాఠాలను రూపొందించింది. వచ్చే ఏడాది పదో తరగతికి డిజిటల్ పాఠాల రూపకల్పనకు ఏర్పాట్లు చేస్తోంది. డిజిటల్ పాఠాలను 3 మార్గాల్లో (మన టీవీ, కేయాన్, హార్డ్ డిస్క్) అందిస్తోంది. ముందుగా రికార్డు చేసిన పాఠాలను వీటి ద్వారా విద్యార్థులకు బోధించేలా చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌లో లైవ్ పాఠాలను అందించాలని యోచిస్తోంది. ఇప్పటికే వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసింది. విద్యార్థులకు ఏదైనా సందేహం తలెత్తితే ఆయా నంబర్లకు మెసేజ్ పంపించి నివృత్తి చేసుకునే ఏర్పాట్లు చేస్తోంది. తరగతి గదిలో బోధించిన పాఠాలను యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది.   ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించి అందులో డిజిటల్ పాఠాలను పొందుపరిచేందుకు కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో త్రీడీ యానిమేషన్ రూపంలోనూ పాఠాలను రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది.

మరిన్ని వార్తలు