గోదారి పరవళ్లు

11 Jul, 2016 02:42 IST|Sakshi

మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
జిల్లా వ్యాప్తంగా వర్షాలు

భూపాలపల్లి ఓసీపీలో చేరిన నీరు.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి

 

హన్మకొండ  గడిచిన రెండు వారాలుగా కమ్ముకున్న మబ్బులు ఆదివారం చిరుజల్లులు కురిపించాయి. భారీ వర్షం కాకున్నా ఉదయం నుంచి రాత్రి వరకు చినుకులు పడడంతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 1.3 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భూపాలపల్లిలో 4.6 సెంటీమీటర్లు, చిట్యాల, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో 3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. మరోవైపు  ఎనిమిది మండలాల్లో వర్షపు జాడ లేదు. జిల్లా కేంద్రం లో 1.5 సె.మీ. సగటు వర్షపాతం నమోదైంది.


పోటెత్తిన గోదావరి
ఏటూరునాగారం : ఎగువ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తి పొంగి ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం 9 మీటర్లకు చేరుడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 9.90 మీటర్లకు చేరితో రెండో, 11 మీటర్లకు చేరి తే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు. గోదావరి ఉప్పొంగడంతో జీడివాగులో నీటిమట్టం పెరిగి రామన్నగూడెం- రాంనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లిలో కురుస్తు న్న వర్షాల కారణంగా ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సోమవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.

మరిన్ని వార్తలు