అప్పుల బాధతో నలుగురు రైతుల ఆత్మహత్య

23 Nov, 2014 01:55 IST|Sakshi

సాక్షి నెట్‌వర్క్: అప్పుల బాధతో వేర్వేరు జిల్లాల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుద్రంగికి చెందిన దయ్యాల లక్ష్మణ్(58) అనే రైతు మూడెకరాల్లో వరిసాగు చేశాడు. పొలాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో రూ. 1.80 లక్షలకు పైగా అప్పు చేసి మూడు బోర్లు వేశాడు. నీరు పడకపోవడంతో రెండెకరాలు ఎండిపోయింది. సాగు కోసం కూడా రూ. 40 వేల అప్పు చేసి ఉన్నాడు. అప్పు తీరే మార్గం కనిపించక శనివారం ఇంటిముందున్న విద్యుత్ స్తంభానికి ఉరి వేసుకున్నాడు. లక్ష్మణ్ ఇద్దరు కొడుకులు సుదర్శన్, తిరుపతి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు.

చొప్పదండి మండలం దేశాయిపేటకు చెందిన రైతు కాదాసి చంద్రయ్య(50) గతంలో వ్యవసాయం చేసి అప్పుల పాలయ్యాడు. దీంతో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లగా అక్కడా విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. కొద్ది రోజులకు కోలుకుని ఇంటికి వచ్చిన ఆయన ఈ ఏడాది రెండున్నర ఎకరాల్లో పత్తి పంట వేశాడు. వర్షాభావం నేపథ్యంలో పంట దెబ్బతినడంతో కలత చెందిన ఆయన శుక్రవారం రాత్రి ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగాడు.  

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి శివారు కస్నాతండాకు చెందిన రైతు బానోతు భీమ్లా(40) రెండున్నర ఎకరాల్లో పత్తి వేశాడు. గతంలో పంటల సాగు, ఇంటి అవసరాల కోసం రూ. 3 లక్షల వరకు అప్పు చేశాడు. పత్తికి తెగు ళ్లు సోకడంతో మందు కొనాల్సి రాగా, 50 కిలోల పత్తి బస్తాను అమ్మాడు. రూ. 3 వేలు మాత్రమే వచ్చాయి. పంటకు తెగుళ్లు సోకడం.. గిట్టుబాటు ధరలేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. శుక్రవారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు.  

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి(45)కి 13 ఎకరాల భూమి ఉండగా, అందులో ఖరీఫ్‌లో పత్తి, వరి, వేరుశనగ పంటలు సాగుచేశాడు. పంటల సాగుతోపాటు కూతురు పెళ్లికోసం దాదాపు రూ. ఐదులక్షల వరకు అప్పుచేశాడు. గతంలో మరో నాలుగు లక్షల అప్పుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తగ్గిపోవడం.. రుణదాతలకు ముఖం చూపలేక ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టాడు.
 
గుండెపోటుతో మరొకరు..
నల్లగొండ జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటకు చెందిన రైతు అమరబోయిన లింగయ్య(55) తన ఐదెకరాలతోపాటు మరో 13 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పదేళ్లుగా సాగు చేస్తున్నాడు. ఈ ఏడూ పదెకరాలలో వరి, ఒకటిన్నర ఎకరాల్లో మిర్చి, మిగిలినదాంట్లో పత్తిసాగు చేశాడు. రూ. పది లక్షలు అప్పు చేశాడు. పంట పోయింది. దీంతో లింగయ్య శుక్రవారం రాత్రి పొలం వద్దే గుండెపోటుతో మృతి చెందాడు.
 

>
మరిన్ని వార్తలు