ఆడపిల్లల్లో విద్యావ్యాప్తికి కృషి అవసరం

8 Jul, 2015 00:17 IST|Sakshi
ఆడపిల్లల్లో విద్యావ్యాప్తికి కృషి అవసరం

* వీవీ కన్యాశాల శతాబ్ది ఉత్సవాల్లో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్
* నిజాం పాలనలో ఈ స్కూలును నడిపించడం సాహసోపేతమే

 
సాక్షి, హైదరాబాద్: ఆడపిల్లల విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. అమ్మాయిని విద్యావంతురాలిని చేస్తే ఆమె కుటుంబ సభ్యులందరినీ విద్యావంతులను చేసినట్లేనని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కన్యాశాల శతాబ్ది ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ కవిత, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్ ప్రసంగిస్తూ ఏదైనా సంస్థ వందేళ్లు పూర్తిచేసుకోవడం గొప్ప విషయమని, అందులోనూ అమ్మాయిలకు విద్యనందించే సంస్థ ఈ ఘనత సాధించడం మరెంతో గొప్ప విషయమన్నారు. నిజాం పాలనలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ విద్యార్థినుల కోసం మరాఠీలో వీవీ కన్యాశాలను నడిపించడం సాహసోపేతమైనదన్నారు. గతం నుంచి తెలంగాణ పోరాటం అన్యాయం, అక్రమాలపై జరిగిందని, సమ్మక్క, సారక్కలు ఆధిపత్యానికి, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడి అమరత్వం పొందారని గుర్తుచేసుకున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రెండేళ్లలో కోటి ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
 
బతుకమ్మ, బోనాలతో చైతన్యం: కవిత
 తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ, బోనాల ద్వారా సంస్కృతిని చాటి మహిళలను చైతన్యవంతులను చేశామని ఎంపీ కవిత అన్నారు. మరాఠీ మాతృభాష అయినాకాళోజీ నారాయణరావు తెలుగులో రాసిన కవితలు తెలంగాణ ఉద్యమంలో నినాదాలుగా పనిచేశాయన్నారు.

>
మరిన్ని వార్తలు